బతుకమ్మ కుంట చెరువే.. ఇదిగో పక్కా ఆధారాలు :హైడ్రా కమిషనర్ రంగనాథ్

బతుకమ్మ కుంట చెరువే.. ఇదిగో పక్కా ఆధారాలు :హైడ్రా కమిషనర్ రంగనాథ్

బతుకమ్మ కుంటపై వస్తోన్న  ఆరోపణలను హైడ్రా  తిప్పికొట్టింది. హైదరాబాద్లో చెరువుల పునరుద్ధరణ, చెరువుల ఆక్రమణలు , లాండ్ ఇష్యూస్  పై  మాట్లాడిన  హైడ్రా కమిషనర్ రంగనాథ్ .. బతుకమ్మ కుంట అభివృద్ధిని సవాలు చేస్తూ ఎడ్ల సుధాకర్ కోర్టును ఆశ్రయించారని అయితే  ఆయన దగ్గర కేవలం 1986 నాటి అన్‌-రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ మాత్రమే ఉందని చెప్పారు. నిబంధనల ప్రకారం.. రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉంటేనే భూమిపై హక్కు చెల్లుబాటు అవుతుందని తెలిపారు. గతంలోనే కోర్టు సైతం ఆయన అక్కడ పొజిషన్‌లో లేరని స్పష్టం చేసింది. డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు అక్కడ ఉన్న బోర్డులు, నిర్మాణాలను హైడ్రా ఇప్పటికే తొలగించింది. కోర్టు ఉత్తర్వులను తాము తూచా తప్పకుండా పాటిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అక్కడ అసలు చెరువే లేదన్న సుధాకర్ వాదనను హైడ్రా కమిషనర్ రంగనాథ్  కొట్టిపారేశారు.  1970 నాటి సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల్లోనూ, 1975 నాటి పహానీల్లోనూ 'ఎర్ర కుంట' పేరుతో ఈ చెరువు ఉనికి ఉంది. చివరకు 1990 నాటి NASA శాటిలైట్ చిత్రాల్లో సైతం బతుకమ్మ కుంట స్పష్టంగా కనిపిస్తోంది. అంటే, భూమిని చెరువుగా మార్చామన్న వాదనలో వాస్తవం లేదని, తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తున్నామని హైడ్రా వెల్లడించింది.హైడ్రా కాపాడిన భూములను ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూళ్లకు   ఉపయోగ పడుతున్నాయని చెప్పారు. 

►ALSO READ | గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్ 

కేవలం బతుకమ్మ కుంట మాత్రమే కాదు.. నార్సింగిలోని ముష్కిమ్ చెరువు, సున్నం చెరువు ఆక్రమణల విషయంలోనూ హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. సున్నం చెరువు బాధితులకు ముఖ్యమంత్రి ఆదేశాలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తోంది. ఐలాపూర్ ప్రభుత్వ భూమి ఆక్రమణలపై డ్రైవ్ చేపట్టినప్పటికీ.. పేదలకు ఇబ్బంది కలగకుండా 1500 ఇళ్లను కూల్చలేదని స్పష్టం చేసింది.  ఇప్పటివరకు హైడ్రా 2,093 ఎకరాల ప్రభుత్వ భూమి రికవరీ చేసింది. దీని విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సుమారు 80 వేల కోట్లు. ఆక్రమణదారులపై ఇప్పటివరకు 90 ఎఫ్.ఐ.ఆర్ (FIR) లు నమోదయ్యాయి.   అటు ఫాతిమా కాలేజీ విషయంలోనూ హైకోర్టు ఆదేశాల మేరకు ఎఫ్.టి.ఎల్ (FTL) డిమార్కింగ్ ప్రక్రియను చేపట్టనుందని తెలిపారు రంగనాథ్.