ప్రగతినగర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

ప్రగతినగర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

జీడిమెట్ల, వెలుగు: వేసవి కాలం దృష్ట్యా అగ్నిప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. నిజాంపేట్ సర్కిల్ ప్రగతినగర్ వద్ద మంగళవారం రాత్రి ఫర్నిచర్ దుకాణాల్లో జరిగిన భారీ అగ్నిప్రమాద స్థలాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ ప్రమాదంలో సుమారు 22 దుకాణాలు దగ్ధమై ఒక్కో షాపులో రూ. 25 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. 

విద్యుత్ వైర్లు లేదా ట్రాన్స్​ఫార్మర్ వద్ద మంటలు చెలరేగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని బాధితులు వివరించగా, కేవలం అధికారుల తనిఖీల వల్ల మాత్రమే ప్రమాదాలను అరికట్టలేమని, ప్రజల్లో స్వీయ క్రమశిక్షణ, సేఫ్టీ నార్మ్స్ పాటించడం అత్యంత ముఖ్యమని రంగనాథ్ స్పష్టం చేశారు. ఫైర్ సేఫ్టీని నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా హైడ్రాకు తగిన అధికారాలు కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినట్లు ఈ సందర్భంగా ఆయన  వెల్లడించారు.