- విలువ రూ. 90 కోట్లకు పైనే – ఫెన్సింగ్వేసిన హైడ్రా స్టాఫ్
హైదరాబాద్ సిటీ, వెలుగు : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ.90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 626/2లో 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అటవీ అభివృద్ధి సంస్థకు 166 ఎకరాలను కేటాయించారు. 9.05 ఎకరాలుండగా నిజాంలకు చెందిన భూములని కొంతమంది హక్కులు క్లెయిమ్చేయగా, కోర్టులో కేసు వేశారు.
దీంతో స్టే వచ్చింది. అయినా, ఆ ఆర్డర్‌ను పట్టించుకోకుండా తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ భూమిని చదును చేసి లే అవుట్‌గా మార్చడంతో ఫిర్యాదులు వచ్చాయి. ఫీల్డ్లెవెల్లో పరిశీలించి నిజమేనని తేలడంతో హైడ్రా రంగంలోకి దిగింది. 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది.
ఓవర్ హెడ్‌ట్యాంకు కూల్చేసిన హైడ్రా
సంజీవరెడ్డి నగర్‌లో 65 ఏండ్ల కింద 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో, 80 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను బుధవారం హైడ్రా కూల్చేసింది. జేఎన్టీయూ ఇంజినీరింగ్ నిపుణులు ఈ ట్యాంక్ వినియోగానికి పనికిరాదని నివేదిక ఇవ్వడంతో 15 ఏండ్లుగా నిరుపయోగంగా ఉంది. చుట్టూ ఇండ్లు, సమీపంలో వాటర్‌బోర్డు, జీహెచ్‌ఎంసీ, హౌసింగ్ బోర్డు ఆఫీసులు, ట్రాన్స్ఫార్మర్ఉండడంతో కూల్చడం సవాలుగా మారింది.
దీంతో వాటర్బోర్డ్..హైడ్రాను సంప్రదించగా, బుధవారం ఉదయం 6 గంటలకు ఐరన్ రోపులు, రెండు ఎత్తయిన హిటాచీల సాయంతో కూల్చివేతలు మొదలుపెట్టారు. ఉదయం 10 గంటల కల్లా మొత్తం ప్రక్రియ పూర్తి చేశారు. నిర్మాణం ఉన్న పరిధిలోనే ట్యాంక్ పడేలా చర్యలు తీసుకోవడంతో చుట్టుపక్కల బిల్డింగులకు ఎలాంటి నష్టం జరగలేదు.

