- కాపాడిన భూముల విలువ రూ.100 కోట్ల పైనే
హైదరాబాద్ సిటీ, వెలుగు: పాతబస్తీలో 6500 గజాల గ్రౌండ్ను బుధవారం హైడ్రా కాపాడింది. ఇందులో జీ ప్లస్ 3 ఐదు బిల్డింగులతో పాటు మరో రెండు సింగిల్ రూమ్ లు కడుతుండగా కూల్చేశారు. దీని విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పక్క స్థలంలో కడతామని హుడా పర్మిషన్తీసుకుని గ్రౌండ్లో భవనాలు కడుతున్నట్టు గుర్తించారు.
188 ఎకరాల్లో అనుమతి పొంది..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్ దేవులపల్లి విలేజ్ శాస్త్రీపురం కాలనీలో 188 ఎకరాల్లో హుడా అనుమతి పొందిన లేఔట్లో 1800కి పైగా ప్లాట్లున్నాయి. ఇందులో 6500 గజాల స్థలాన్ని ప్లే గ్రౌండ్ కోసం కేటాయించారు. గ్రౌండ్‌కు చెందిన స్థలం అని తెలిసినా మూడేండ్లుగా నోటరీ మీద స్థానికంగా ఉన్న కబ్జాదారులు ప్లాట్లుగా చేసి అమ్మేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ గతంలో నోటీసులు కూడా ఇచ్చింది.
2024లో కూల్చివేస్తామని స్పీకింగ్ ఆర్డర్లు కూడా జారీ చేసింది. అయినా పట్టించుకోకుండా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా, హైడ్రా, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆక్రమణ నిజమేనని తేల్చి కూల్చివేశారు. ఇంకో రెండు భవనాల్లో జనాలు ఉంటుండడంతో వదిలేశారు. కాగా, ఎంఐఎం పార్టీ ముఖ్యనేతలతో పాటు ఓ ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ ఈ ఆక్రమణల వెనుక ఉన్నట్లు సమాచారం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో....
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలంలోని అక్షయ ఎన్‌క్లేవ్ పేరుతో1983లో 7.12 ఎకరాల్లో లే ఔట్ వేశారు. హుడా అనుమతి పొందిన లే ఔట్‌లో 968 గజాల మేర ఉన్న పార్కును తప్పుడు పత్రాలతో అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ గోపాల్ అనే వ్యక్తి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
పరిశీలించిన హైడ్రా పార్కు స్థలంగా నిర్ధారించుకుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రహరీ నిర్మించి గేటు కూడా పెట్టిందని తెలుసుకుంది. 2019లో తప్పుడు పత్రాలతో నిర్మాణ అనుమతులు తెచ్చుకుని నిర్మాణాలకు సిద్ధమవడంతో జీహెచ్ఎంసీ అధికారులతో పాటు సొసైటీ ప్రతినిధులు కేసులు పెట్టారు. తాజాగా 968 గజాల పార్కు స్థలంలో కబ్జాదారులు వేసిన సామగ్రిని తొలగించి పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.
