హైదరాబాద్ మియాపూర్ లో..రూ. 3 వేల కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

హైదరాబాద్ మియాపూర్ లో..రూ. 3 వేల కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
  •   15 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం 
  •     ఆక్రమణలు తొలగించి, చుట్టూ ఫెన్సింగ్ 
  •     హైదరాబాద్ మియాపూర్‌‌‌‌లో భారీ ఆపరేషన్ 

మియాపూర్, వెలుగు: హైదరాబాద్ మియాపూర్‌‌‌‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. దాదాపు15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నది. అక్కడి ఆక్రమణలు తొలగించి, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ రూ.3 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం  మియాపూర్ పరిధిలోని మక్తా మ‌‌హ‌‌బూబ్‌‌ పేట గ్రామ స‌‌ర్వే నంబ‌‌ర్‌‌‌‌ 44లో ప్రభుత్వ భూమి ఆక్రమ‌‌ణ‌‌ల‌‌కు గురవుతోంద‌‌ని హైడ్రాకు గ‌‌తంలో ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదు మేరకు గ‌‌తేడాది డిసెంబ‌‌ర్‌‌‌‌ 8న 5 ఎక‌‌రాల మేర ఉన్న ఆక్రమ‌‌ణ‌‌ల‌‌ను హైడ్రా తొలగించింది. మియాపూర్–బాచుప‌‌ల్లి ప్రధాన ర‌‌హ‌‌దారికి ఆనుకుని 200 మీట‌‌ర్ల మేర ఉన్న 18 షెటర్లను తొల‌‌గించింది. తాజాగా అదే స‌‌ర్వే నంబ‌‌ర్‌‌‌‌ 44లో 15 ఎక‌‌రాల‌‌ను శ‌‌నివారం స్వాధీనం చేసుకుంది. కొందరు రేకులతో హ‌‌ద్దుల‌‌ను నిర్ణయించి ఆక్రమ‌‌ణ‌‌ల‌‌కు పాల్పడ‌‌గా, వాటిని తొల‌‌గించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డుల‌‌ను ఏర్పాటు చేసింది. ఈ స‌‌ర్వే నంబ‌‌రులోని భూమిని కొందరు వ్యక్తులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా రిజిస్ర్టేష‌‌న్ చేసుకున్నట్టు వెలుగులోకి రావడంతో సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌‌‌‌ను ప్రభుత్వం సస్పెండ్​చేయడంతో పాటు పీడీ యాక్టు నమోదు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఎకరన్నర వరకు కబ్జా చేసిన‌‌ ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు న‌‌మోదైంది. 

షెడ్ల కూల్చివేత.. 

ప్రధాన రహదారి వెంబడి ఉన్న చిన్న షెడ్లు కూడా ప్రభుత్వ భూమిలో ఉండడంతో కొన్నింటిని హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇదే భూమిలో ఉన్న భారీ వాణిజ్య షెడ్లను కూడా కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు. అయితే వాటి యజమానులు, స్థానిక రాజకీయ నేతలు అడ్డుకున్నారు. హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారు.  అనంతరం బాచుపల్లి–మియాపూర్​రోడ్డుపై బైఠాయించి హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్​పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించివేశారు. దీంతో ఈ షెడ్లను హైడ్రా అధికారులు కూల్చకుండా వదిలేశారు. అయితే పేదల షెడ్లను కూల్చి, మిగిలిన వాళ్లవి వదిలేశారని బాధితులు వాపోయారు.