హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఎక్కడ కూల్చివేతలు జరిగినా తమకే ఆపాదిస్తూ సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారాన్ని హైడ్రా తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియను హైకోర్టు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ మున్సిపల్ కార్పొరేషన్లే చేపడుతున్నాయని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించింది.
హైడ్రా ప్రధానంగా చెరువులు, నాలాలు, రోడ్లు, పార్కుల ఆక్రమణలను తొలగిస్తున్నామని పేర్కొంది. ఇప్పటికే వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని తెలిపింది. అలాగే గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించే పనిలో హైడ్రా నిమగ్నమై ఉందని వివరించింది.

