హైదరాబాద్: హైకోర్టుకు వస్తే తల్లి ఒడిలో ఉన్నట్లు అనిపిస్తుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయాధికారుల సదస్సుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను హైకోర్టులో తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ హైకోర్టు తనకు చాలా నేర్పిందన్నారు. తెలంగాణ హైకోర్టులో 11 ఏళ్లు పనిచేశానన్నారు. తెలంగాణ సాధన కోసం న్యాయవాదులు చాలా శ్రమించారని గుర్తుచేశారు. ఎంత పెద్ద పదవిలో ఉన్న తాను ఎప్పటికీ తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యుడినేనని పేర్కొన్నారు. తనను ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలకు శతకోటి వందనాలు తెలుపుతున్నానని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
