పంజాగుట్ట, వెలుగు: ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుతమైన సమాచార మార్పిడి ద్వారానే ప్రజా సంబంధాలు (పీఆర్) బలోపేతమవుతాయని నిపుణులు తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవానికి హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ టి. రజనీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నైతికతతో కూడిన కమ్యూనికేషన్ పారదర్శకతను పెంచుతుందని, సంస్థలకు- ప్రజలకు మధ్య పీఆర్ ఒక వారధిలా పనిచేస్తుందని పేర్కొన్నారు. సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. సంక్షోభ సమయంలో కచ్చితమైన సమాచార ప్రాముఖ్యతను వివరించారు. సీనియర్ జర్నలిస్ట్ వనజ, పీఆర్ఎస్ఐ ప్రతినిధులు డాక్టర్ యాదగిరి కంభంపాటి, రాజేశ్ కల్యాణ్, యూఎస్ శర్మ పాల్గొన్నారు.

