- అసలు యజమానికే హక్కులు.. కోర్టు తీర్పు
అబిడ్స్, వెలుగు: ఢిల్లీ మిఠాయి వాలా పేరుతో నగరంలో నడుస్తున్న కొన్ని స్వీట్స్ దుకాణాలపై అసలు యజమాని జితేందర్ కాచ్వహ న్యాయపోరాటంలో విజయం సాధించారు. ఢిల్లీ మిఠాయి వాలా పేరును 1968 నుంచే తమ పేరుతో రిజిస్టర్ చేసుకున్నామని, అదే పేరును ఇతరులు వినియోగించడం వల్ల తమ బ్రాండ్ ప్రతిష్టకు భంగం కలుగుతోందని కోర్టును ఆశ్రయించారు.
విచారణ జరిపిన ప్రిన్సిపల్ కమర్షియల్ కోర్టు న్యాయమూర్తి ఉదయ్ కుమార్.. ఈ బ్రాండ్ హక్కులు జితేందర్ కాచ్వహకే చెందుతాయని స్పష్టం చేస్తూ మంగళవారం అనుకూల తీర్పు ఇచ్చారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు నగరంలోని నాలుగు దుకాణాలకు ఢిల్లీ మిఠాయి పేరును పోలీసుల సమక్షంలో తొలగించారు. నగరంలో ఎవరైనా ఢిల్లీ మిఠాయి పేరును అనధికారికంగా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

