- రూ.60 వేలు అడిగి, రూ.40 వేలకు ఒప్పందం
- రూ.20 వేలు ఇచ్చినా మరో 20 వేల కోసం సతాయింపు
- తట్టుకోలేక ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు
వికారాబాద్, వెలుగు: భార్యను వేధిస్తున్నాడని తాండూరుకు చెందిన ఓ కౌన్సిలర్, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ. 60 వేలు లంచం అడిగిన వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సరోజ, ఎస్సై రాణిలపై మంగళవారం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు దొరకడంతో పోలీస్ స్టేషన్‌లోనే గంటల తరబడి విచారణ జరిపారు.
వికారాబాద్‌జిల్లా తాండూరుకు చెందిన ఓ కౌన్సిలర్ భార్య తనను భర్తతో పాటు అత్తమామలు, చెల్లెళ్లు, సోదరుడు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. అయితే, ఈ కేసులో సీఐ సరోజ, ఎస్సై రాణి.. నిందితులకు, ఫిర్యాదుదారులకు కౌన్సెలింగ్ఇవ్వకుండా అదే రోజు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని స్టేషన్‌కు పిలిపించి హైదరాబాద్‌లో ఉంటున్న చెల్లెళ్లకు, వృద్ధులైన తల్లిదండ్రులతో పాటు అందరికీ నోటీసులు ఇస్తామని బెదిరించారు.
అలా జరగకుండా ఉండాలంటే ఆరుగురికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 60 వేలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. దీంతో అంత ఇవ్వలేనని, రూ. 40 వేలు ఇస్తామని నిందితుడు ఒప్పందం చేసుకున్నాడు. అనుకున్న ప్రకారం ముందు రూ.20 వేలను సీఐ సరోజ సమక్షంతో ఎస్సై రాణికి చెల్లించాడు. మిగిలిన రూ. 20 వేలు సర్దుబాటు కాలేదని, త్వరలోనే ఇస్తానని చెప్పాడు.
అయినా వేధిస్తుండడంతో ఏసీబీ అధికారులను కలిసి విషయం వివరించాడు. వారు విచారణ జరపగా, అది నిజమేనని తేలింది. సాక్ష్యాధారాలు దొరకడంతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ఆధ్వర్యంలో ఏసీబీ టీం మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సీఐ, ఎస్సైలను విచారణ జరిపి కేసు నమోదు చేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ ఆనంద్కుమార్చెప్పారు.

