టాలీవుడ్ ప్రేక్షకులకు 'సీతారామం'తో చేరువైన నటి మృణాల్ ఠాకూర్. పద్ధతిగా కనిపిస్తూనే, నిజ జీవితంలో అత్యంత స్వతంత్ర భావాలున్న యువతిగా తన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి నటించిన బాలీవుడ్ చిత్రం ‘దో దీవానే శహర్ మే’ (Do Deewane Shehar Mein) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా మృణాల్ తన గత ప్రేమ, బ్రేకప్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
అతనే బ్రేకప్ చెప్పాడు..
సాధారణంగా హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ మృణాల్ మాత్రం తన గతాన్ని ధైర్యంగా పంచుకున్నారు. "నేను సినిమాల్లోకి రావడం నా మాజీ ప్రియుడికి అస్సలు నచ్చలేదు. నేను చాలా దూకుడుగా ఉంటానని, నాతో జీవితాన్ని పంచుకోవడం కష్టమని భావించి అతనే బ్రేకప్ చెప్పాడని ఆమె వెల్లడించారు. అయితే, ఆ బ్రేకప్ ఆమెను కుంగదీయలేదు. "అతను వెళ్ళిపోయినందుకు నేను ఏడవలేదు. కానీ, ఒక మహిళ కెరీర్‌ను గౌరవించలేని అతని ఆలోచనా విధానం చూసి జాలి వేసింది. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం కంటే, విడిపోవడమే మేలని భావించాను. ఎందుకంటే, అలాంటి తండ్రి వద్ద పెరిగే పిల్లలు కూడా అదే పాతకాలపు ఆలోచనలతో పెరుగుతారు. అది నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పింది.
ధనుష్ తో డేటింగ్ పై క్లారిటీ ..
మృణాల్ క్రేజ్ పెరిగేకొద్దీ ఆమె చుట్టూ రూమర్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గత కొద్ది నెలలుగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఇందులో నిజం లేదని మృణాల్ స్పష్టం చేశారు. ధనుష్ తనకు గౌరవప్రదమైన సహచరుడు మాత్రమేనని ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది.
మరోవైపు, టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తోనూ ఆమె పేరు వినిపించింది. ఇలాంటి వార్తలపై మృణాల్ చాలా కూల్‌గా స్పందించారు. కొంతమంది పనిగట్టుకొని ఇలాంటి కథలు అల్లుతుంటారు. అవి వినడానికి నాకు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. నిజానికి నాకు తెలియకుండానే నా గురించి ఫ్రీగా పబ్లిసిటీ (Free PR) చేస్తున్నందుకు వారికి థాంక్స్ చెప్పాలి అని చమత్కరించారు.
థియేటర్లలో ‘దో దీవానే శహర్ మే’ సందడి
ఇక సినిమాల విషయానికి వస్తే.. మృణాల్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ డ్రామా ‘దో దీవానే శహర్ మే’ ఈ నెల 20న గ్రాండ్‌గా విడుదల కానుంది. రవి ఉద్యవర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆధునిక నగర జీవితంలో ఇద్దరు యువతీ యువకుల మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో సాగుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌లో మృణాల్, సిద్ధాంత్ చతుర్వేదిల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నటిగా గ్లామర్ పాత్రలతో పాటు, బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మృణాల్ దూసుకుపోతున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆమె మరో భారీ విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి!
