మీ త్యాగాలను ఎన్నటికీ మరువం: ప్రధాని మోడీ

మీ త్యాగాలను ఎన్నటికీ మరువం: ప్రధాని మోడీ
  • ఎమర్జెన్సీ టైంలో డెమోక్రసీని కాపాడిన వారినుద్దేశించి ప్రధాని ట్వీట్

న్యూఢిల్లీ: దేశంలో ఎమర్జెన్సీ విధించి 45 ఏళ్లు అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం త్యాగాలు చేసిన వారిని ఇండియా గుర్తుంచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఇందిరా గాంధీ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు అత్యవసర పరిస్థితిని విధించింది. దీన్ని గుర్తు చేసుకుంటూ పీఎం మోడీ ఓ ట్వీట్ చేశారు.

‘ఇప్పటికి సరిగ్గా 45 ఏళ్ల ముందు ఇండియాలో ఎమర్జెన్సీ విధించారు. ఆ సమయంలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పాటుపడిన వారికి శతకోటి వందనాలు. వారి త్యాగాలు, బలిదానాలను దేశం ఎన్నటికీ మరువదు’ అని మోడీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మోడీతోపాటు హోం మినిస్టర్ అమిత్ షా, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కాంగ్రెస్‌ను విమర్శించారు. ‘అధికారం కోసం ఒక కుటుంబ దురాశ వల్లే ఎమర్జెన్సీ విధించారు. దీంతో ఆ రోజు కేవలం ఒక్క రాత్రిలో దేశం మొత్తం జైలులోకి వెళ్లిపోయింది. ప్రెస్, కోర్టులు, మాట్లాడే స్వేచ్ఛ.. అన్నింటినీ తొక్కేశారు’ అని అమిత్ షా మండిపడ్డారు.