- స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్ లో డెమొక్రాట్లకు ప్రెసిడెంట్ ట్రంప్ పిలుపు
వాషింగ్టన్: దేశంలోకి అక్రమ వలసలను అడ్డుకునేందుకు మెక్సికో బోర్డర్ లో గోడకట్టాల్సిందేనని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి తేల్చి చెప్పారు. ప్రతీకార రాజకీయాలను వీడి కలిసి రావాలంటూ బుధవారం డెమోక్రాట్లకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో పట్టింపులకు పోతే అమెరికన్ల నెత్తిపై మరోసారి షట్ డౌన్ భారం తప్పదని చెప్పారు. ఈ పరిస్థితిని తప్పించేందుకు సహకరించాలని కోరారు. ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ స్పీచ్ లో ట్రంప్ డెమోక్రాట్లను అభ్యర్థించారు. అమెరికా ప్రెసిడెంట్ గా తన ఎన్నికపై అనవసర ఆరోపణలు మానుకోవాలని సభ్యులకు సూచించారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను పరిశీలించాలని చెప్పారు. దాదాపు గంటన్నర(82 నిమిషాలు) పాటు సాగిన తన స్పీచ్ లో అమెరికన్ల ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తానని ట్రంప్ చెప్పారు. దీనికోసం పార్టీలకతీతంగా పనిచేస్తున్నానని ఆయన చెప్పుకున్నారు.
ఓ మంచి పనికోసం ఇలాంటి చిన్న చిన్న పరిమితులను దాటడం తప్పుకాదని వివరించారు. అక్రమంగా దేశంలోకి అడుగుపెడుతున్న వారివల్ల అమెరికన్ల జీవితం కల్లోలంగా మారుతోందన్నారు. కొంతమంది ఉద్యోగాలు కోల్పోతుంటే , మరికొంతమంది తక్కువ జీతానికే పనిచేస్తున్నారని చెప్పారు. క్రైం రేటు కూడా దారుణంగా పెరిగి పోతోందని ట్రంప్ చెప్పారు. సరిహద్దుల్లో గోడ కట్టాలనే ప్రతిపాదన చాలా కాలంనాటిదేనని అన్నారు. ఇప్పుడు సభలో కూర్చున్న వాళ్లలో చాలామంది గతంలో దీనికి అనుకూలంగా ఓటేశారని, అయినా ఇప్పటి వరకు బోర్డర్ లో ఎలాంటి గోడ కట్టలేదని ట్రంప్ చెప్పారు.
పాత గాయాలను నయం చేసుకుందాం..
దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ట్రంప్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. అంతా కలిసి పాత గాయాలను నయంచేసుకుందామని ప్రతిపాదించారు. అమెరికా భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకుందామని అన్నారు. శాంతియుతంగా ఉంటూ ధర్మాన్ని అనుసరించే చోట యుద్ధానికి తావులేదని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. సమీప భవిష్యత్తులో దేశం ఎదుర్కోబోయే అతిపెద్ద సవాల్ అక్రమ వలసలేనని
హెచ్చరించారు. దీనిని అడ్డుకోవడానికి గోడ నిర్మాణం విషయంలో కలిసి రావాలని కోరారు. మెక్సికో బోర్డర్ లో గోడ నిర్మాణానికి సంబంధించి 5.7 బిలియన్ డాలర్లు కేటాయించాలన్న ట్రంప్ సర్కారు ప్రతిపాదన ఇప్పటికీ ఆమోదం పొందలేదు. స్పెండింగ్ బిల్లు పెండింగ్ లో పడడంతో ఏకంగా అమెరికా షట్ డౌన్ కు దారితీసింది. 35 రోజుల పాటు కొనసాగిన షట్ డౌన్ తర్వాత డెమోక్రాట్ల డిమాండ్ మేరకు ట్రంప్ తాత్కాలికంగా ఎత్తివేశారు. ఈ నెల 15 వరకు ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా జరిగేందుకు అంగీకరించారు. ఈ సమయంలో మెక్సికో బోర్డర్ వాల్ నిర్మాణానికి అవసరమైన నిధులకు సంబంధించి డెమోక్రాట్లతో చర్చలు జరపనున్నట్లు ట్రంప్ వివరించారు.
నా వల్లే ఉత్తర కొరియాతో యుద్ధం తప్పింది
ఉత్తర కొరియాతో వార్ ముప్పు తప్పడానికి కారణం తానేనని ట్రంప్ అన్నారు. ప్రెసిడెంట్ పదవిలో తాను కాకుండా మరెవరున్నా నార్త్ కొరియాతో ఈపాటికి పెద్ద యుద్ధమేచేసి ఉండేవాళ్లమన్నారు. నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్‌తో ఈ నెలాఖరులో వియత్నాంలో భేటీ అవుతానని చెప్పారు.
ఏంటీ ఎస్ఓటీయూ?
స్టేట్ ఆఫ్ ది యూనియన్(ఎస్ఓటీయూ) అంటే.. కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి ప్రెసిడెంట్ ఇచ్చే ప్రసంగం. ఏటా సభ్యులందరినీ పిలిచి గతేడాది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సాధించిన
విజయాలు, వచ్చే ఏడాది తీసుకోబోయే నిర్ణయాలు, రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వబోతోంది.. తదితర వివరాలను ప్రెసిడెంట్ తన స్పీచ్ లో వెల్లడిస్తారు.
