ఎంపీగా లేకపోతేనేం.. మీ కొడుకుగా ఉంటా : వరుణ్ గాంధీ

ఎంపీగా లేకపోతేనేం.. మీ కొడుకుగా ఉంటా : వరుణ్ గాంధీ
న్యూఢిల్లీ: సొంత పార్టీ పైనే విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి లోక్ సభ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు.  ఉత్తరప్రదేశ్ లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిలిభిత్ స్థానం నుంచి బీజేపీ మరొకరిని బరిలోకి నిలిపింది. ఈ నేపథ్యంలో పిలిభిత్ నియోజకవర్గ ప్రజలకు ఆయన భావోద్వేగంతో లేఖ రాశారు. ‘‘1983లో మూడేండ్ల వయసులో మా అమ్మ వేలు పట్టుకొని ఈ ప్రాంతంలో అడుగుపెట్టడం ఇప్పటికీ గుర్తే. నాకు పిలిభిత్ ప్రజలకు ఉన్న సంబంధం రాజకీయాలకు అతీతమైనది. ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా బంధం చివరి శ్వాస వరకు కొనసాగుతుంది. పిలిభిత్ ప్రజలకు సేవ చేయడం నాకు దక్కిన అదృష్టం. 

ఇక్కడి ప్రజల నుంచి చాలా నేర్చుకున్నా. ఆదర్శంగాఉండటం, దయతో మెలగడం, ఆడంబరాలకు దూరంగా ఉండటం అలవరుచుకున్నా. ఇవన్నీ నా ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేశాయి. ఇక్కడి ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. ఎంపీ పదవి లేకపోయినప్పటికీ.. నేనెప్పుడూ మీ కొడుకుగా ఉంటూ సేవ చేస్తా. మీ కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నాకు మీ ఆశీర్వాదం కావాలి” అని వరుణ్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.