మా సమస్యలను పరిష్కరించకుంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తం

మా సమస్యలను పరిష్కరించకుంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తం

​​​​​​హైదరాబాద్, వెలుగు: ఈ నెల15 లోపు తమ సమస్యలు పరిష్కరించాలని లేదంటే వచ్చే నెలలో12 లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు సర్కారును హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా వారి సమస్యలపై చర్చించేందుకు మంగళవారం హైదరాబాద్​లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు నుంచి ప్రభుత్వం స్థానిక సంస్థల వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్నారు. గ్రామ పంచాయతీలకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ.. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలను పట్టించుకోవటం లేదన్నారు.

లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల టైమ్ లో ఓట్ల కోసం తమను ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. తమ ఓట్ల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్సీలు కూడా మండలిలో తమ సమస్యలను ప్రస్తావించటం లేదన్నారు. ‌‌స్థానిక సంస్థలకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని, ప్రతి ఎంపీటీసీకి రూ.50 లక్షలు, జడ్పీటీసీకి రూ.1 కోటి డెవలప్ మెంట్ కు ఫండ్స్ కేటాయించాలని, ఆగస్టు15న మండల పరిషత్ స్కూల్ లో జెండా ఎగురవేసే అవకాశం ఎంపీటీసీలకు ఇవ్వాలని, పంచాయతీ ఆఫీస్ లో ఎంపీటీసీకి కుర్చీ కేటాయించాలని డిమాండ్​చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు బెల్లం శ్రీను, ఎంపీటీసీలు శ్రీశైలం, శ్రీనుతో పాటు వివిధ జిల్లాల నుంచి సుమారు 50 మంది లోకల్ బాడీ నేతలు పాల్గొన్నారు.