అడ్మిషన్‌‌‌‌‌‌‌‌ గడువు దాటితే .. సర్కారు కాలేజీల్లోనూ జరినామ

అడ్మిషన్‌‌‌‌‌‌‌‌ గడువు దాటితే .. సర్కారు కాలేజీల్లోనూ జరినామ

ఆగస్టు1 నుంచి చేరితే రూ.500 జరిమానా

  • అడ్మిషన్ గడువు పెంచి ఫైన్ల వసూళ్లకు తెరలేపిన ఇంటర్ బోర్డు 
  • ఉచిత విద్య అంటూ  జరిమానా వేయడంపై లెక్చరర్ల ఫైర్ఇ
  • ఇప్పటికే స్టూడెంట్ల అడ్మిషన్లు తగ్గుతున్నాయని ఆవేదన

హైదరాబాద్, వెలుగు : అడ్మిషన్  గడువు దాటితే ఇకపై ఇంటర్మీడియెట్  సర్కారు కాలేజీల్లోనూ ఫైన్  కట్టాల్సిందే. ఈ మేరకు ఇంటర్  బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఆగస్టు1 నుంచి16 వరకు చేరితే రూ.500 ఫైన్ కట్టాలని ఆదేశాలు జారీచేసింది. ఉచిత విద్య అంటూనే ఫైన్ల పేరుతో వసూళ్లకు తెరలేపింది. ఫస్టియర్ లో అడ్మిషన్ల గడువు పెంచుతూనే బాదుడు షురూ చేసింది. చరిత్రలో ఇలాంటిది ఎప్పుడూ లేదని, వెంటనే ఈ విధానాన్ని తొలగించాలని లెక్చరర్లు డిమాండ్  చేస్తున్నారు. ఉచిత విద్య అంటూ సర్కారు తీసుకున్న నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఈ నెల 25 వరకూ ఇంటర్  ఫస్టియర్ అడ్మిషన్లకు గడువు ఉండింది. అయితే, కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఇతర గురుకులాల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో అడ్మిషన్ల గడువును పెంచుతూ ఇంటర్  బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 31 వరకూ ఎలాంటి ఫైన్  లేకుండా కాలేజీల్లో చేరొచ్చని ప్రకటించింది. మరోపక్క గుర్తింపు ఉన్న కా లేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని, ఆ లిస్టును వెబ్ సైట్​లో పెట్టామని ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు.

సెలవుల్లో అడ్మిషన్లు ఎలా? 

ఫైన్  లేకుండా ఈనెల 31 వరకూ అడ్మిషన్ల గడువు పెంచినా స్టూడెంట్లకు ఉపయోగం లేకుండా పోయింది. వారం రోజులుగా రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 20, 21, 22వ తేదీల్లో ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నెల 23న ఆదివారం వచ్చింది. 24, 25వ తేదీలో భారీగా వర్షాలు పడ్డాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు బంద్  అయ్యాయి.

బయటకు వచ్చే పరిస్థితి లేదు. వర్షాలు తగ్గకపోవడంతో 26, 27వ తేదీల్లోనూ ప్రభుత్వం మరోసారి విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చింది. 28న ఆప్షనల్ హాలిడే ఉండగా, 29న మొహర్రం, 30న ఆదివారం రానుంది. దీంతో ఫైన్​  లేకుండా గడువు పెంచినా ఫలితం లేకుండా పోయింది. 

పేద విద్యార్థుల నుంచి వసూళ్లా? 

రాష్ట్రంలోని 408 ఇంటర్మీడియెట్  సర్కారు కాలేజీల్లో ఇప్పటి వరకూ 67 వేల వరకూ అడ్మిషన్లు జరిగాయి. 20 రోజుల క్రితం టెన్త్  అడ్వాన్స్ డ్  సప్లిమెంటరీ ఫలితాలు రాగా... కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యే సమయంలో వర్షాలు మొదలయ్యాయి. దీంతో చాలా మంది ఇంకా చేరలేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు1 నుంచి సర్కారు కాలేజీల్లో చేరే స్టూడెంట్లు ఫైన్  కట్టాలంటూ ఇంటర్  బోర్డు ఆదేశాలు ఇవ్వడంపై కాలేజీ లెక్చరర్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

ప్రభుత్వం ఉచిత విద్య అంటూ ఇలా పేద విద్యార్థుల నుంచి జరిమానా వసూలు చేయడం సరికాదని ఇంటర్  విద్యా జేఏసీ చైర్మన్  మధుసూధన్  రెడ్డి ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు విద్యార్థుల అడ్మిషన్లు లేని టైంలో జరిమానాల పేరుతో వసూళ్లు చేయడం స్టూడెంట్లకు మరింత భారంగా మారుతుందని ఆయన చెప్పారు. వెంటనే ఇంటర్  బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్  ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.