హైదరాబాద్ మెట్రోకు కేంద్రం లోన్ ఇవ్వకపోతే సొంతంగానే ముందుకు

హైదరాబాద్ మెట్రోకు కేంద్రం లోన్ ఇవ్వకపోతే సొంతంగానే ముందుకు

హైదరాబాద్ మెట్రో విషయంలో తెలంగాణ ప్రభుత్వం అగ్రెసివ్ గా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. IRFC లోన్​ విషయంలో త్వరలో మరోసారి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయాలని ఇటీవలే సీఎం రేవంత్, మంత్రులు నిర్ణయించారు. ఆ తర్వాత వారం, పదిరోజులు వేచిచూడాలని, అప్పటికీ లోన్‌‌కు కేంద్రం గ్రీన్ ​సిగ్నల్​ఇవ్వకుంటే ఇతర ప్రైవేట్​ బ్యాంకుల నుంచి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. 

ఐఆర్‌‌‌‌ఎఫ్‌‌సీ నుంచి తీసుకునే అప్పుపై కేవలం 4 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. కానీ బయట బ్యాంకుల నుంచి 8 శాతం వడ్డీ రేటు చెల్లించక తప్పని పరిస్థితి ఉంటుంది. కేంద్రం తీరువల్ల మెట్రో పనులు ఆగితే మరింత నష్టం తప్పదని భావిస్తున్న ప్రభుత్వం 8 శాతం వడ్డీకైనా సరే  ఏదైనా బ్యాంక్ లేదా ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణం సేకరించేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్తులో మెట్రో ఫేజ్-–2 విస్తరణ ప్రాజెక్టులో భాగస్వామ్యానికి కేంద్రం ముందుకు రాకుంటే ఇక ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగడం పక్కనపెట్టి, ఎన్వోసీ తీసుకోవాలని యోచిస్తోంది.  

నిజానికి మెట్రో–2ను  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యం (50:50 )లో చేపడితే.. ఈ ప్రాజెక్టుకయ్యే మొత్తం రూ. 32,237 కోట్ల వ్యయంలో కేంద్ర ప్రభుత్వం తన ఈక్విటీ  వాటా కింద  కేవలం రూ. 5,802 కోట్లను (18%) మాత్రమే గ్రాంట్ల రూపంలో సమకూరుస్తుంది. అంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కేటాయించాల్సి ఉంటుంది. భూసేకరణ, పరిహారం పంపిణీ ఖర్చుల కింద మరో రూ. 2,902 కోట్లను (9%) రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా భరించాలి. 

మిగిలిన  55 శాతం నిధులను, అంటే దాదాపు రూ. 17,731 కోట్లను అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఐఆర్‌‌ఎఫ్‌‌సీ  ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు సేకరించాలనేది ప్లాన్​. కేంద్ర పెద్దల కొర్రీల నేపథ్యంలో జాయింట్​వెంచర్​ కోసం చూడకుండా కేంద్రం నుంచి ఎన్వోసీ లభించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా మెట్రో విస్తరణను పట్టాలెక్కించేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక సైతం సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.