ఇప్పటికిప్పుడు లోక్‌‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి 296 సీట్లు

ఇప్పటికిప్పుడు లోక్‌‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి 296 సీట్లు
  • ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌‌’లో వెల్లడి
  • ప్రధానిగా నరేంద్ర మోడీకి 53 శాతం మంది జై
  • రాహుల్‌‌ను ప్రతిపక్ష నేతగానూ అంగీకరించని జనం
  • గత ఆరు నెలల్లో బీజేపీకి పెరిగిన మద్దతు

దేశంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే జనం బీజేపీకే అధికారమిస్తారని ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌’ సర్వే తేల్చింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు 296 లోక్‌సభ సీట్లు వస్తాయని చెప్పింది. బీజేపీ సింగిల్‌గానే 271 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. మరోవైపు ప్రధానిగా నరేంద్ర మోడీకే 53% మంది మద్దతు ప్రకటించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో మోడీకి 50 శాతం మందికి పైగా సపోర్ట్ చేశారు. 

న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు జనరల్ ఎలక్షన్లు జరిగితే ప్రజలు బీజేపీకే పట్టం కడుతారని ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌‌’లో వెల్లడైంది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు 296 లోక్‌‌సభ సీట్లు వస్తాయని తేలింది. బీజేపీ సింగిల్‌‌గానే 271 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే చెప్పింది. మరోవైపు ప్రధానిగా నరేంద్ర మోడీకే జనం జై కొట్టారు. దాదాపు 53 శాతం మంది ఆయనకు మద్దతు ప్రకటించారు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో మోడీకి 50 శాతం మందికి పైగా సపోర్ట్ చేశారు. పంజాబ్‌‌లో మాత్రమే ఆయనకు మద్దతు కాస్త తగ్గింది. ప్రధాని మోడీ పని తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నరు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి జనం జై కొడుతారు? ప్రతిపక్షాలను లీడ్ చేసే పార్టీ మారుతుందా? తదితర 10 అంశాలపై ఇండియా టుడే సర్వే చేసింది. తాము చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు.. పార్లమెంటు నియోజకవర్గాలకు అనుగుణంగా ఉంటాయని చెప్పింది. ఈ మీడియా సంస్థ తమ సర్వే ఫలితాలను ఏటా జనవరి, ఆగస్టులో రిలీజ్ చేస్తుంటుంది.

రాహుల్ కంటే మమత బెటర్!
దేశంలో ప్రతిపక్ష పార్టీలను లీడ్ చేసేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే బెటర్ అని సర్వేలో తేలింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కంటే మమతకే ఎక్కువ రేటింగ్ వచ్చింది. మమతకు 17% మంది, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌‌కు 16% మంది, రాహుల్ కి 11% మంది సపోర్ట్ చేశారు.

తర్వాతి ప్రధానిగా మళ్లీ మోడీనే
తర్వాతి ప్రధానిగా ఎవరైతే బెటర్ అన్న ప్రశ్నకు 53 శాతం మంది మోడీ పేరు చెప్పారు. కేవలం 7 శాతం మంది మాత్రమే రాహుల్ గాంధీకి సపోర్ట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్‌‌కు 6 శాతం, అమిత్ షాకు 4 శాతం మంది మద్దతు ప్రకటించారు. ఈ నలుగురిలో ముగ్గురు బీజేపీ నేతలే కావడం గమనార్హం.

మద్దతు పెరిగింది..
ఆరు నెలల కిందటితో పోలిస్తే తాజాగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పెరిగింది. గత ఆగస్టులో చేసిన సర్వేలో 53 శాతం మంది ఎన్డేయే ప్రభుత్వంతో సంతృప్తి చెందినట్లు చెప్పారు. ఇప్పుడు మద్దతు ఇచ్చేటోళ్లు 59 శాతానికి పెరిగారు. ఇదే సమయంలో అసంతృప్తుల సంఖ్యా గతంతో పోలిస్తే పెరిగింది. ఆగస్టులో 17 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇప్పుడు ఇది 26 శాతానికి చేరింది. 

ఇప్పటికిప్పుడు లోక్‌‌సభ ఎన్నికలు జరిగితే..
బీజేపీ    271 సీట్లు
కాంగ్రెస్    62 సీట్లు
టీఎంసీ    35 సీట్లు
ఆప్    4 సీట్లు
ఇతరులు    171 సీట్లు
మొత్తం    543  సీట్లు

ఐదు రాష్ట్రాల్లో మోడీకి మద్దతు ఇలా..
ఉత్తరప్రదేశ్    75 శాతం
పంజాబ్    37 శాతం
ఉత్తరాఖండ్    59 శాతం
మణిపూర్    73 శాతం
గోవా    67 శాతం