కివీస్ను క్లీన్ స్వీప్ చేస్తే..టీమిండియాదే అగ్రస్థానం

కివీస్ను క్లీన్ స్వీప్ చేస్తే..టీమిండియాదే అగ్రస్థానం

లంకతో టీ20, వన్డే సిరీస్ను దక్కించుకుని కొత్త ఏడాదిని సరికొత్తగా ప్రారంభించిన టీమిండియా..కివీస్తో వన్డే, టీ20 సిరీస్కు సిద్దమైంది. ఈ నెల 18 నుంచి వన్డే సిరీస్ మొదలవనుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో వన్డేల్లో అగ్రస్థానమే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగనుంది.  

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ప్రస్తుతం 117 పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ (113), ఆస్ట్రేలియా (112).  భారత్ (110) , పాకిస్తాన్ (106) పాయింట్లతో వరుసగా ఉన్నాయి. అయితే కివీస్తో జరిగే మూడు వన్డేల్లోనూ గెలుస్తే టీమిండియా వన్డేల్లోనూ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. 

ఇప్పటికి భారత జట్టు టీ20ల్లోనూ అగ్రస్థానంలో ఉంది. తాజాగా జరగబోయే వన్డే సిరీస్లోనూ కివీస్ను క్లీన్ స్వీప్ చేస్తే..వన్డేల్లోనూ అగ్రస్థానం గ్యారెంటీ.  ఇక మిగిలింది టెస్టులు. త్వరలో ఆస్ట్రేలియతో జరిగే టెస్టు సిరీస్లో కంగారులను చిత్తుచేస్తే.. టెస్టుల్లోనూ భారత్ నెంబర్ వన్ స్థానం సాధిస్తుంది. దీంతో మూడు ఫార్మాట్లలోనూ అగ్ర స్థానాన్ని దక్కించుకునే అవకాశాన్ని టీమిండియా  సొంతం చేసుకునే వీలుంది. 

భారత్, న్యూజిలాండ్ జట్ల విషయానికి వస్తే..టీమిండియాలో ప్రస్తుతం కోహ్లీ, గిల్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి బ్యాట్స్మన్ టాప్ ఫాంలో ఉన్నారు. దీనికి తోడు బౌలర్లు బాగానే రాణిస్తున్నారు. ఈ సిరీస్లోనూ వీరు చెలరేగితే కివీస్ను ఓడించడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. మరోవైపు న్యూజిలాండ్కు ఈ సిరీస్లో టాప్ బ్యాట్స్మన్ దూరమయ్యారు. కీలక ఆటగాళ్లైన కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ వన్డే సిరీస్లో ఆడటం లేదు. భారత్, న్యూజిలాండ్ మధ్య జనవరి 18, 21, 24 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. జనవరి 27, 29, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టీ20 మ్యాచులు జరగనున్నాయి.