
ఉప్పల్, వెలుగు: కాళ్లేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంపుసెట్లు, 203 కిలోమీటర్ల జల ప్రవాహమని, ఇంత పెద్ద ప్రాజెక్టులో ఒక్క బ్యారేజీలోని మూడు పిల్లర్లు కుంగితే ప్రాజెక్ట్ పోయినట్టా అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ పై సీబీఐ దర్యాప్తునకు కోరడాన్ని ఖండిస్తున్నామన్నారు.
మంగళవారం (సెప్టెంబర్ 03) ఉప్పల్ రింగు రోడ్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర చేస్తోందన్నారు. సీబీఐ ప్రధాని మోదీ చేతుల్లో ఉందని రాహుల్ గాంధీ ఆరోపిస్తుంటూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీబీఐకే కాళేశ్వరం అప్పజెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఘోష్ కమిషన్ చెప్పినా ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమన్నారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం
ఎల్బీనగర్: తెలంగాణను పచ్చని మాగాణిగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దుయ్యబట్టారు. మంగళవారం మీర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బాలాపూర్ చౌరస్తా వరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేపట్టారు. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలు చేయడం తగదన్నారు.