కొడిమ్యాల అడవిలో అక్రమాలు...వరుసగా విజిలెన్స్, ఏసీబీ దాడులు

 కొడిమ్యాల అడవిలో అక్రమాలు...వరుసగా విజిలెన్స్, ఏసీబీ దాడులు
  •     చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలకు నిలయమైన అడవిలో అక్రమాల ఆరోపణలు
  •     చెట్ల నరికివేత, అటవీ భూముల ఆక్రమణలు, కలప స్మగ్లింగ్‌‌ పై ఫిర్యాదులు
  •     అటవీ సంపదను కాపాడకపోతే వన్యప్రాణుల ఉనికికే ముప్పు

జగిత్యాల, వెలుగు: అభయారణ్యం లాంటి జగిత్యాల జిల్లా కొడిమ్యాల రేంజ్‌‌ ఫారెస్ట్​లో వరుసగా వెలుగుచూస్తున్న అక్రమాలు అటవీశాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 12,256.83 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతం చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, నీలుగాయిలు, హైనాలకు సురక్షిత ఆవాసంగా గుర్తింపు పొందింది. గతేడాది ఓ పెద్దపులి దాదాపు ఆరు నెలలపాటు ఈ అడవిలో సంచరించడం ఈ ప్రాంత జీవవైవిధ్యానికి నిదర్శనం. అలాంటి విలువైన అటవీ ప్రాంతంలోనే చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణా, భూముల ఆక్రమణలు, అధికారుల అవినీతి ఆరోపణలు వరుసగా వెలుగుచూస్తుండడం ఆందోళన 
కలిగిస్తోంది.

అక్రమాలపై వరుస దర్యాప్తులు

  • ఈ నెల 17న కొడిమ్యాల మండలం శనివారంపేట శివారులో సుమారు 8 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నారనే ఫిర్యాదుతో రాష్ట్ర విజిలెన్స్ అధికారులు సర్వే నిర్వహించి విచారణ చేపట్టారు.
  • ఈనెల 6న సామిల్ యజమాని పర్మిట్ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేదనే ఆరోపణలపై జిల్లా అటవీశాఖ కార్యాలయంలో రాష్ట్ర విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహించారు.
  • జూన్ 4న కొడిమ్యాల ఎఫ్‌‌ఆర్‌‌వో మొయినొద్దీన్ చెట్ల నరికివేతకు సంబంధించిన వ్యవహారంలో రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అనంతరం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించి మరికొందరు అధికారుల పాత్రపై విచారణ చేపట్టారు.
  • జూన్ 29న మల్యాల మండలం గొర్రెగుండంలో అనుమతికి మించి టేకు చెట్లు నరికివేశారనే ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలకు సిఫారసు చేశారు.
  • ఏప్రిల్ 22న సారంగాపూర్ మండలం మ్యాడారం తండాకు చెందిన ఆరుగురు వ్యక్తులు కరెంటు తీగలతో రెండు అడవి దున్నలను వేటాడిన ఘటనలో కేసు నమోదు చేయడంతో పాటు ఇద్దరు అటవీశాఖ అధికారులకు మెమోలు జారీ చేశారు.

జీవ వైవిధ్యానికే ముప్పు

విలువైన టేకు చెట్లు, అరుదైన వన్యప్రాణులకు నిలయమైన కొడిమ్యాల అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత, అటవీ భూముల ఆక్రమణలు కొనసాగితే జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవులు క్షీణిస్తే వన్యప్రాణుల సంచారం తగ్గడంతో పాటు మానవ -వన్యప్రాణుల ఘర్షణలు పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. అటవీ సంపద పరిరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.