దేశంలో అక్రమ నిఘా అసాధ్యం

దేశంలో అక్రమ నిఘా అసాధ్యం
  • దేశంలో అక్రమ నిఘా అసాధ్యం
  • ‘పెగాసస్’తో ఫోన్లు హ్యాక్ అయినట్లు ఆధారాల్లేవ్: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: మన దేశంలో చట్ట విరుద్ధంగా వ్యక్తులపై అక్రమ నిఘా పెట్టడం అసాధ్యమని కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు. ఇజ్రాయెల్ కంపెనీ ‘ఎన్ఎస్ వో గ్రూప్’కు చెందిన పెగాసస్ స్పైవేర్ తో మన దేశంలో జర్నలిస్టులు, ఇద్దరు కేంద్ర మంత్రులు, జడ్జిలు, యాక్టివిస్టుల ఫోన్లు హ్యాక్ చేశారన్న వార్తలపై కేంద్ర మంత్రి సోమవారం పార్లమెంటులో స్పందించారు. పెగాసస్​తో ఫోన్లు హ్యాక్ అంటూ పెద్ద కథను బయటకు తెచ్చారని, కానీ ఇందులో విషయమేమీ లేదన్నారు. సరిగ్గా పార్లమెంటు సమావేశాలకు ముందు రోజే ఈ అంశం తెరపైకి రావడం యాదృచ్ఛికమేమీ కాదన్నారు. ఎన్ఎస్​వో గ్రూప్ లిస్టులో ఫోన్ నెంబర్లు ఉన్నంత మాత్రాన హ్యాకింగ్ జరిగిందని చెప్పలేమన్నారు.

లిస్టులో మరికొందరి పేర్లు..

పెగాసస్ స్పై వేర్​తో పది దేశాల్లోని ప్రముఖ వ్యక్తుల ఫోన్లు 2018–19లో హ్యాక్ అయ్యాయంటూ పెగాసస్ ప్రాజెక్టు పేరుతో 17 మీడియా సంస్థలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ వో గ్రూప్ వద్ద ఉన్న ఫోన్ నెంబర్ల లిస్టు కన్ఫామ్ అయిందంటూ ఆదివారం ది వైర్ వెల్లడించింది. మన దేశంలో 300కు పైగా ఫోన్లు హ్యాక్ అయ్యాయని తెలిపింది. సోమవారం మరికొందరి పేర్లతో లిస్టు విడుదలచేసింది. రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్ పటేల్​, వైరాలజిస్ట్ గగన్ దీప్ కాంగ్​లతో పాటు అశోక్ లవాసా, జగ్దీప్ ఛోకర్ తదితరుల నెంబర్లు ఎన్ఎస్​వో గ్రూప్ టార్గెట్ లిస్టులో ఉన్నాయని ది వైర్ పేర్కొంది.

ఏంటీ పెగాసస్?

స్మార్ట్ ఫోన్​లను హ్యాక్ చేసి, నిఘా పెట్టేందుకు వాడే స్పైవేర్ రకం సాఫ్ట్ వేర్ ఇది. ఇజ్రాయెల్ కంపెనీ ఎన్​ఎస్​వో దీనిని తయారుచేసింది. ప్రస్తుతం మార్కెట్లోని స్పైవేర్​లలో పవర్ ఫుల్ ఇదే. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు తెలియకుండా ఇది వారి ఫోన్లలోకి చేరిపోయి నిఘా పెడుతుంది. యూఆర్ఎల్ పంపడం, మిస్డ్ కాల్స్, వాట్సాప్ వంటి యాప్​ల ద్వారా ఇది ఇతరుల ఫోన్​లలో ఇన్​స్టాల్ అవుతుం ది. హ్యాక్ అయిన ఫోన్ల నుంచి మెసేజ్​లు, మెయిల్స్, ఫోన్ కాల్స్, లొకేషన్ వంటి డేటానంతా పంపుతుంది. స్క్రీన్ షాట్లు తీసుకోవ చ్చు. ఏయే బటన్స్ నొక్కారో తెలుసుకోవచ్చు. బ్రౌజర్ హిస్టరీ, డేటా మొత్తాన్నీ తీసుకోవచ్చు. ఎన్​క్రిప్టెడ్ చాట్స్, ఫైల్స్ చూడొచ్చు.

ప్రభుత్వాలకు మాత్రమే..

యాంటీ సోషల్ యాక్టివిటీల కంట్రోల్​కోసం తయారు చేసిన ఈ స్పైవేర్​ సేవలను దేశాల ప్రభుత్వాలకు మాత్రమే అందిస్తున్నట్లు ఎన్ఎస్​వో చెప్తోంది.