
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని హైదరదాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడతాయని తెలిపింది. మే 15న,మే 16న తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. ఉరుములు మెరుపులు, ఈదురు గాలులు అధికంగా ఉండడంతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు ఈదురుగాలులు, వర్షాలు కురిసే ప్రభావంతో పశ్చిమ, పలు దక్షిణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగతా అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కొనసాగుతుందని వెల్లడించింది.
12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్. ఈ జిల్లాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు , 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రానున్న ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదుకానున్నాయి. ఈ రోజు నగరంలో ఈదురుగాలులు అధికంగా వీచే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇవాళ ( మే 15 ) ఉదయం వర్షం దంచికొట్టింది.. రెండు గంటల పాటు కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు.