అక్టోబర్ 21 కల్లా పీఎం ఫసల్ బీమా అమలు చేయాలి : ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్

అక్టోబర్ 21 కల్లా పీఎం ఫసల్ బీమా అమలు చేయాలి : ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
  •     లేదంటే 22 నుంచి ఆదిలాబాద్‌‌‌‌ నుంచి రైతు యాత్ర: పాయల్ శంకర్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అక్టోబర్ 21 లోపు ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ను అమలు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. లేకుంటే అక్టోబర్ 22న ఆదిలాబాద్‌‌‌‌ నుంచి హైదరాబాద్‌‌‌‌ సచివాలయం వరకు భారీ రైతు యాత్ర చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, కరెంట్ కోతలతో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  మంగళవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. 

దేశవ్యాప్తంగా అన్నదాతలకు భరోసా కల్పించేందుకు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన స్కీము తెలంగాణలో అమలు చేయకపోవడం క్షమించరాని నేరమన్నారు. సైద్ధాంతికంగా వ్యతిరేకించే కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం సైతం దీన్ని అమలు చేస్తుంటే, రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారన్నారు. గతంలో బీఆర్ఎస్ పదేళ్లలో పంటల బీమాను పట్టించుకోలేదని విమర్శించారు.