తెలంగాణలో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు

తెలంగాణలో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు
  •     జర్మనీ పర్యటనలో ప్రవాసులతో స్పీకర్, మండలి చైర్మన్ భేటీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, ప్రవాస తెలంగాణవాసులు ముందుకు రావాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. విదేశీ పర్యటనలో భాగంగా మంగళవారం జర్మనీలోని ఫ్రాంక్‌‌‌‌‌‌‌‌ఫర్ట్‌‌‌‌‌‌‌‌లో భారత రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలుగు ప్రవాసుల ప్రత్యేక సమావేశంలో వారు మాట్లాడారు. 

గ్రేటర్ హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెట్టుబడులకు ఇది ఎంతో అనుకూలమైన ప్రాంతమని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించిందని గుర్తుచేశారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు తమ మాతృభూమితో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ, రాష్ట్ర పురోగతిలో క్రియాశీలక భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.