హైదరాబాద్, వెలుగు: ‘వివిధ కారణాల వల్ల చదువు మధ్యలోనే ఆగిపోయిందని బాధపడకండి.. మళ్లీ పుస్తకం పట్టి మీ కలను నెరవేర్చుకోండి’ అని పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క మహిళలకు పిలుపునిచ్చారు. ఆడబిడ్డలు కేవలం ఆర్థికంగానే కాకుండా చదువు, నైపుణ్యాల్లోనూ రాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా రోజూ బడికి వెళ్లే అవసరం లేకుండానే, ఇంట్లోనే ఉంటూ 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు.
ఈ మేరకు మంగళవారం ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. చదువుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని, 40 ఏండ్లయినా చదువుకోవచ్చని, ఇందుకు తన జీవితమే ఉదాహరణ అని గుర్తుచేశారు. వివిధ కారణాలతో ఆగిపోయిన తన చదువును తాను మళ్లీ కొనసాగించకపోయి ఉంటే.. నేడు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదన్నారు. మహిళలు ఒక్క అడుగు ముందుకు వేస్తే, ఆగిపోయిన చదువును పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఉల్లాస్ పరీక్షలోనూ ఉత్తీర్ణులయ్యారు..
‘అమ్మకు అక్షరమాల’ ద్వారా ఇప్పటికే లక్షలాది మంది మహిళలు రాయడం, చదవడం, లెక్కలు నేర్చుకున్నారని, ఉల్లాస్ పరీక్షలోనూ ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. వారంతా ఇప్పుడు 'టాస్' ద్వారా పదో తరగతి పరీక్షలు రాసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. మహిళలు చదువుకుంటే సమాజంలో వారికి గౌరవం, ఆత్మవిశ్వాసంతోపాటు మరిన్ని ఆర్థిక అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
