ఆర్ఎఫ్ సీఎల్ ను పూర్తి సామర్థ్యంతో నడపాలి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఆర్ఎఫ్ సీఎల్ ను  పూర్తి సామర్థ్యంతో నడపాలి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  •     ఆఫీస్ ను నోయిడా నుంచి రామగుండంకు తరలించాలి : 
  • పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ


గోదావరిఖని, వెలుగు : రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌‌‌‌ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడిపించి రైతులకు కొరత లేకుండా యూరియా అందించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ప్లాంట్‌‌‌‌ను తరచూ షట్‌‌‌‌డౌన్ చేయడం వల్ల ఉత్పత్తి దెబ్బతింటోందన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏటా 12 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఆర్​ఎఫ్​సీఎల్​ప్లాంట్​ప్రస్తుతం 7 నుంచి 8 లక్షల టన్నులకే పరిమితం కావడానికి కారణాలేంటో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్లాంట్ షట్​డౌన్ కు దారితీస్తున్న అంశాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

ఆర్ఎఫ్​సీఎల్ ను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తూ భవిష్యత్ లో ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. సంస్థను బలహీనపరిస్తే కార్మికులు, రైతులు, ప్రజల తరఫున ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం నోయిడాలో ఉన్న ఆర్ఎఫ్​సీఎల్​కేంద్ర కార్యాలయాన్ని రామగుండానికి తరలించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆర్ఎఫ్​సీఎల్ భవిష్యత్ గురించి పార్లమెంట్‌‌‌‌లో మాట్లాడాలని సూచించారు. ఆర్ఎఫ్ సీఎల్ నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’అంటున్న కేంద్ర ప్రభుత్వ విధానం ‘ఫేక్ ఇన్ ఇండియా’గా మారిందని ఎద్దేవా చేశారు. గతంలో ఆర్ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ సంక్షోభంలో ఉన్న టైంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం సుమారు రూ.10 వేల కోట్ల రుణభారాన్ని మాఫీ చేసిందని గుర్తుచేశారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాకా వెంకటస్వామి, డాక్టర్ వివేక్ వెంకటస్వామి వంటి నాయకుల కృషితో ఎరువుల ఉత్పత్తి పునరుద్ధరించినట్టు పేర్కొన్నారు.