ఫిబ్రవరిలో అమల్లోకి ఎన్‌‌ఎంసీ

ఫిబ్రవరిలో అమల్లోకి ఎన్‌‌ఎంసీ

హైదరాబాద్, వెలుగు: నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) యాక్ట్ అమలుకు రంగం సిద్ధమైంది. కమిషన్ చైర్​పర్సన్ సహా సభ్యుల నియామకం, అన్ని రాష్ర్టాల వైద్య విద్య విభాగాలతో కేంద్రం సంప్రదింపులు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఫిబ్రవరి నుంచే ఎన్‌‌ఎంసీ అమల్లోకి వచ్చే అవకాశముందని మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఒక్కసారి ఎన్‌‌ఎంసీ అమల్లోకి వస్తే.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎంసీఐ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌‌ ఆటోమేటిక్‌‌గా రద్దు అవుతాయి.

మరో నాలుగు బోర్డులు

ఆయా రాష్ర్టాలు ప్రతిపాదించిన జాబితాల నుంచి 25 మందిని ఎంపిక చేసి వారిని కమిషన్ సభ్యులుగా కేంద్రం నియమించింది. 2020–21 అకడమిక్ ఇయర్​ప్రారంభంలోగా ఎన్‌‌ఎంసీలో అంతర్భాగంగా అండర్‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌ మెడికల్ ఎడ్యుకేషన్‌‌ బోర్డు (యూజీఎంఈబీ), పోస్ట్‌‌ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు(పీజీఎంఈబీ), మెడికల్ అసెస్‌‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు, ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ర్టేషన్ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ 4 బోర్డుల చైర్‌‌‌‌పర్సన్లను నియమించాల్సి ఉంది.

ఫీజు నిర్ణయించేది ఎన్‌‌ఎంసీనే

2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్‌‌, ఎండీ సీట్ల ఫీజులపై ప్రస్తుతం వివిధ రాష్ర్టాల్లోని ప్రభుత్వాలతో ప్రైవేటు మెడికల్ కాలేజీలు సంప్రదింపులు చేస్తున్నాయి. రాష్ర్టంలోనూ ఫీజుల పెంపుకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ప్రస్తుతం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 85 శాతం సీట్ల ఫీజులను రాష్ర్ట ప్రభుత్వాలే నియంత్రిస్తున్నాయి. 15 శాతం సీట్ల ఫీజులను కాలేజీలు నిర్ణయించుకుంటున్నాయి. అయితే ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్ల ఫీజులను ఎన్‌‌ఎంసీనే నియంత్రించనుంది. మిగిలిన 50శాతం సీట్ల ఫీజుల నియంత్రణ ఆయా రాష్ర్ట ప్రభుత్వాల పరిధిలో ఉండనుంది. దీంతో 2020–21లో ఫీజులు ఎట్లుంటాయన్న దానిపై కొంత ఆసక్తి నెలకొంది. రాష్ర్టంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. మేనేజ్‌‌మెంట్ కోటా సీట్లతో పోలిస్తే, వీటి ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. కన్వీనర్ కోటా సీట్ల ధరలను రాష్ర్ట ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. ఎన్‌‌ఎంసీ వచ్చాక ఈ సీట్ల ఫీజులు ఎవరు నియంత్రిస్తారన్నది తేలాల్సి ఉంది.

కాలేజీలకు రేటింగ్‌‌

దేశవ్యాప్తంగా ఒకటే ఎంట్రన్స్‌‌(నీట్‌‌)తో ఎంబీబీఎస్‌‌ సీట్లను స్టూడెంట్లకు కేటాయిస్తున్నారు. 15 శాతం సీట్లను నేషనల్ కోటాలో భర్తీ చేస్తున్నారు. అయితే కాలేజీల ఎంపికలో ప్రైవేటు సంస్థల సర్వేలు, కన్సల్టెన్సీల వెబ్ సైట్లు ఇచ్చే సమాచారంపైనే ఆధారపడాల్సి వస్తోంది. కొన్ని కాలేజీలు డబ్బులు ఇచ్చి మంచి రేటింగ్స్ తెచ్చుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ ప్రైవేటు సర్వేలపై ఆధారపడే అవసరం లేకుండా, ఎన్‌‌ఎంసీలోని మెడికల్ అసెస్‌‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు.. దేశంలో అన్ని కాలేజీలకు రేటింగ్స్ ఇవ్వనుంది. ఎంసీఐ తనిఖీలు చేసినట్టుగానే.. ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్‌‌ను ఈ బోర్డు తనిఖీ చేస్తుంది. కాలేజీల్లో ఉన్న వసతులు, విద్యా ప్రమాణాల ఆధారంగా రేటింగ్స్‌‌ ఇస్తుంది.