పిలగాండ్లు..  తెలివైన ఫ్రెండ్

పిలగాండ్లు..  తెలివైన ఫ్రెండ్

మాదారం అనే గ్రామంలో మహేష్, సురేష్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. మహేష్ చాలా చురుకైన వాడు. పాఠశాల నుంచి వచ్చిన తర్వాత తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ, ఇంటి పనులు చేసేవాడు. సురేష్ మాత్రం ప్రతి పనికి బద్ధకించేవాడు. సురేష్ తండ్రి ‘‘మహేష్ ని చూసి బుద్ధి తెచ్చుకో’’ అని మందలించేవాడు. అయినా అతనిలో మార్పు రాలేదు.

వేసవి సెలవులు కావడంతో ఒకరోజు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి మహేష్ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లారు. ఒకరోజు ఊరికి దూరంగా ఉన్న బావి దగ్గరికి ఆడుకోవడానికి వెళ్లారు. అక్కడ దొరికే ఇరికి పండ్లు, ఈత పండ్లు, తాటి ముంజలు తిన్నారు. అలా కొన్ని రోజులు మస్తు ఎంజాయ్ చేశారు. స్కూళ్లు తెరిచే రోజు దగ్గర పడడంతో సొంతూరుకు బయలుదేరారు.

సాయంత్రం కల్లా ఇంటికి చేరుకోవచ్చు అనుకున్నారు. కానీ సురేష్ మెల్లగా బద్ధకంగా నడిచాడు. అంతలో చీకటి పడింది. దగ్గర్లోనే చిట్టడవి ఉంది. అప్పుడప్పుడు అడవి జంతువులు ఊరు వైపు వస్తుంటాయి. సగం దూరం వెళ్లగానే కోతుల గుంపు కనిపించింది వాళ్లకి. సురేష్ గుంపు పైకి రాళ్లు విసిరాడు. ఆ కోతులు కిచ కిచమంటూ మీదికి రాబోయాయి. మహేష్ తన స్నేహితుడిని అలా చేయొద్దని చెప్పాడు. అడవిలో ఆహారం దొరక్క ఊళ్లోకి వస్తాయని చెప్పాడు. సురేష్ మాత్రం ‘‘ఈ కోతులే కాదు... మనల్ని అడవి జంతువులు కూడా ఏమీ చేయలేవు’’ అని బింకాలు కొట్టాడు. అంతేగాక స్నేహితుడు మహేష్​ను ‘‘నువ్వు ఎప్పుడూ అతి జాగ్రత్తపరుడివే...’’ అంటూ హేళన చేశాడు.

అలా ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటే మరి కాసేపటికి చెట్ల పొదల వెనక నుంచి ఎలుగుబంటి గాండ్రింపు వినిపించింది. రాబోయే ఆపద గమనించిన మహేష్ పక్కనే ఉన్న చెట్టు పైకి ఎక్కాడు. సురేష్ మాత్రం ‘‘ఎలుగుబంటి... గిలుగుబంటి... మనల్ని ఏమి చేయలేదు. రానీ చూద్దాం!” అంటూ కిందనే కూర్చున్నాడు. దూరం నుంచి ఎలుగుబంటి తమవైపే వస్తున్న విషయాన్ని చెట్టు పైన కూర్చున్న మహేష్​కి కనిపించింది. తన స్నేహితుడిని చెట్టు పైకి రమ్మని పిలిచాడు. సురేష్​కి చెట్టు ఎక్కడం రాదు. భయంతో ప్రాణాలు పోయినంత పని అయ్యి వణికిపోయాడు సురేష్​. ఎలాగైనా తన స్నేహితుడిని కాపాడాలని అనుకున్నాడు మహేష్. తను వేసుకున్న ప్యాంట్​ విడిచి సురేష్​కి అందించాడు. దాన్ని గట్టిగా పట్టుకున్న సురేష్​ను పైకి లాగాడు. ఎలుగుబంటి చెట్టు దగ్గరకొచ్చి కాసేపు కేకలు పెట్టింది. ఈలోగా అదే ఊరికి వస్తున్న మనుషుల గుంపును చూసి అడవిలోకి పారిపోయింది. ఆ తరువాత ఇద్దరూ చెట్టు దిగారు. మహేష్​ను హేళన చేసినందుకు క్షమాపణ కోరాడు సురేష్​.

- కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి