ఆర్గాన్స్‌‌ మాయం

ఆర్గాన్స్‌‌ మాయం

మనిషి బాడీలో చిన్న ఆర్గాన్‌‌ని ట్రాన్స్‌‌ప్లాంట్​ చేయాలన్నా శరీరం మీద గాటు పెట్టాల్సిందే. కానీ.. ఇక్కడ జంతువుల ఆర్గాన్స్‌‌ని బాడీ నుంచి తీసేవాళ్లు పెద్ద పెద్ద సర్జన్స్​ను మించిపోయారు. బాడీపై చిన్న గాటు కూడా పెట్టకుండానే ఆర్గాన్స్‌‌ని మాయం చేస్తున్నారు. ఇదేదో.. మ్యాజిక్‌‌లా ఉందే! అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదెవరి పని అని తలలు పట్టుకుంటున్నారు. నార్త్‌‌ అమెరికాలోని సౌత్‌‌ కొలరాడోలో దాదాపు 8,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో శాన్ లూయిస్ వ్యాలీ ఉంది. ఇది చాలా పెద్ద లోయ. ఈ ప్రాంతం చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. తూర్పున సంగ్రే డి క్రిస్టో పర్వతాలు, ఉత్తరాన సావాచ్ పర్వతాలు, పశ్చిమాన శాన్ జువాన్ పర్వతాలు ఉన్నాయి.  ఈ పర్వతాల్లో అనేక రకాల జంతువులు ఉంటాయి. కానీ జనాభా మాత్రం 16,550  మంది మాత్రమే. చాలా ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో దాదాపు 50 ఏళ్ల క్రితం ఒక గుర్రం... కారణం లేకుండా చనిపోయింది. ఇప్పటికీ దాని గురించి చాలామంది మాట్లాడుకుంటారు. ఎందుకంటే..  చనిపోయిన గుర్రం కడుపంతా ఖాళీగా ఉండటమే. పొట్టలో ఆర్గాన్స్‌‌ అన్నింటినీ ఎవరో తీసుకెళ్లారు. అది కూడా దాని పొట్ట కోయకుండానే. ఆ తర్వాత కూడా ఇలాగే కొన్ని జంతువుల ఆర్గాన్స్ మాయం అయ్యాయి. ఆ గుర్రాన్ని నెల్లీ అనే యువకుడు పెంచుతున్నాడు. అది ప్రతి రోజూ వ్యాలీలోకి మేతకెళ్లి రాత్రికి ఇంటికొచ్చేది. ఒకరోజు తిరిగి రాకపోవడంతో నెల్లీ కంగారుపడ్డాడు. దానికోసం అంతా వెతికాడు. ఒక చోట గుర్రం కళేబరాన్ని చూసి బాధపడ్డాడు. దగ్గరికెళ్లి చూసి నోరెళ్లబెట్టాడు. దాని కడుపు ఖాళీగా ఉంది. ఒక్క రక్తపు మరక కూడా లేదు. ఊపిరితిత్తులు, గుండె, మెదడు, థైరాయిడ్ గ్రంథులతోపాటు కడుపులోని అన్ని ఆర్గాన్స్‌‌ మాయం అయ్యాయి. అయితే కళేబరం దగ్గర మాత్రం వింతైన వాసన ఒకటి వచ్చింది. కానీ, అది కుళ్లిన వాసన కాదు. శవాలను తినే చీమలే గుర్రం ఆర్గాన్స్​ను కూడా తిన్నాయని అందరూ అనుకున్నారు. కానీ.. అంత తక్కువ టైంలో ఆర్గాన్స్‌‌ని తినడం చీమల వల్ల కాదని రీసెర్చర్లు తేల్చి చెప్పారు. గుర్రం ఎముకలు గులాబీ రంగులోకి మారాయి. తర్వాత చాలా రోజులు దాన్ని అక్కడే ఉంచారు. చాలా రోజుల వరకు అది ఉబ్బిపోలేదు. వేటాడే జంతువులు, రాబందులు దానిని తినలేదు. 

వంద అడుగుల దూరంలో.. 

గుర్రం కళేబరం దొరికిన దగ్గరి నుంచి దాదాపు వంద అడుగుల దూరం వరకే దాని పాదాల గుర్తులు కనిపించాయి. కళేబరం చుట్టూ ఎలాంటి గుర్తులు కనిపించలేదు. అంటే గుర్రాన్ని  వంద అడుగుల దూరం నుంచి ఎవరో ఆ ప్లేస్‌‌కి మోసుకెళ్లారు. గుర్రం మీద కాలిన గాయాలు దాదాపు 15  వరకు ఉన్నాయి. అవన్నీ సర్కిల్‌‌ ఆకారంలోనే ఉన్నాయి. కళేబరానికి ఉత్తరంగా వంద గజాల దూరంలో ఒక పెద్ద పొద ఉంది. ఆ పొదల్లో గుర్రపు వెంట్రుకలు అంటుకున్న లోహపు ముక్కలు ఉన్నాయి. ఆ ముక్కలను తాకిన నెల్లీ చేతులు మంటలు పుట్టాయి. నీళ్లతో చేతులు బాగా కడుక్కునే వరకు చాలా ఇబ్బంది పడ్డాడు. 

పిడుగుపాటా?

గుర్రాన్ని పరిశీలించిన కొందరు రీసెర్చర్లు పిడుగుపాటు వల్లే అది చనిపోయిందని చెప్పారు. కానీ.. అది చనిపోయిన రోజు వర్షమే కురవలేదు. పైగా ఆ తర్వాత కూడా కొన్ని జంతువులు ఇలాగే చనిపోయాయి. దాంతో గుర్రం చావుకు కారణం పిడుగు కాదని అక్కడివాళ్లు గట్టిగా వాదించారు. దాంతో యునైటెడ్ స్టేట్స్ ఫారెస్ట్ సర్వీసెస్‌‌ ఉద్యోగి డువాన్ మార్టిన్ గీగర్ అక్కడికి వెళ్లి గుర్రాన్ని టెస్ట్ చేశాడు. కాలిన గుర్తుల చుట్టూ ఉన్న చర్మంపై రేడియో యాక్టివ్‌‌ (రేడియోధార్మిక శక్తి) ఉందని చెప్పాడు. 

రక్తం ఏమైంది మరి 

గుర్రం కళేబరాన్ని టెస్ట్‌‌ చేసిన డాక్టర్ ఆల్ట్‌‌షులర్ ఒక నమ్మలేని విషయం చెప్పాడు. ఆయనకు అప్పటికే ఎన్నో శవ పరీక్షలు చేసిన అనుభవం ఉంది. గుర్రం చర్మంపై ఉన్న కాలిన మచ్చల దగ్గర రక్తం లేదు. అప్పుడు ఆల్ట్‌‌షులర్‌‌‌‌కి అది ఎలా జరిగిందో తెలియలేదు. కానీ.. చాలా సంవత్సరాల తర్వాత ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో “నేను వందల కొద్దీ శవపరీక్షలు చేశాను. కొంచెం కూడా రక్తం లేకుండా శవాన్ని కత్తిరించడం సాధ్యం కాలేదు. గుర్రం దగ్గర ఎక్కడా చుక్క రక్తం కూడా లేదు. కానీ.. చర్మం బయటి అంచులు కత్తిరించారు. అయితే.. అవి ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేజర్‌‌‌‌తో కట్‌‌ చేసినట్టు ఉంది. కానీ.. గుర్రం చనిపోయినప్పుడు అంటే.. 1967లో అలాంటి లేజర్ టెక్నాలజీ లేదు’’ అని చెప్పాడు.  

ఏలియన్స్‌‌

గుర్రం చనిపోయినప్పుడు చాలామంది ఆ ప్రాంతంలో కొన్ని వింతలను గమనించినట్టు చెప్పారు. ఒక స్టూడెంట్‌‌ తన కారును ఆకాశంలో ఎగురుతున్న వస్తువు ఒకటి వెంబడించిందని చెప్పాడు. అది ఒక పొలంలో ల్యాండ్ అవడం తాను చూశానన్నాడు. అయితే.. తను దాని దగ్గరకు వెళ్లేందుకు ట్రై చేస్తే కారు టైర్లు ఊడిపోయాయని చెప్పాడు. మరికొందరు ఆరెంజ్‌‌ కలర్ వెహికల్స్‌‌ ఆకాశంలో ఎగరడం చూశామన్నారు. ఏలియన్స్‌‌ వచ్చి ఇక్కడి జంతువుల ఆర్గాన్స్‌‌ని తీసుకెళ్తున్నారని చాలామంది నమ్మారు. కానీ.. ఆర్గాన్స్‌‌ కోసం అంత టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఏంటని మరికొందరి డౌట్​. అసలు వాటితో గ్రహాంతరవాసులు ఏం చేస్తారనేది అందరి మెదళ్లలో తలెత్తిన ప్రశ్న. కానీ.. ఇప్పటికీ దానికి సమాధానం దొరకలేదు. అయితే.. ఈ ఏలియన్స్‌‌ వాదనలను నమ్మనివాళ్లు గవర్నమెంట్‌‌పై నిందలు మోపారు. మరికొందరు సాతాను మతాల పని అన్నారు. 

గుర్రం ఏమైందో..

గడ్డి మైదానం నుంచి తీసుకొచ్చిన గుర్రం కళేబరాన్ని 1968లో పశువుల డాక్టర్‌‌‌‌ వాలెస్ లియరీ ఉడికించాడు. చర్మం, కణజాలాలను తీసేసి, అస్థిపంజరాన్ని ఒక మెటల్ ప్లాట్‌‌ఫామ్‌‌పై బిగించాడు. వైర్లు, స్క్రూలతో ఎముకలను నిలబెట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఒక ప్రైవేట్ మ్యూజియంలో ఉంచారు. అక్కడ అది సుమారు 20 ఏండ్లు ఉంది. ఆ తర్వాత ఏమైందనేది తెలియదు. 

అడవుల్లో జంతువులను వేటాడి చంపేవాళ్లను చూసి ఉంటారు. వాటిని ఎత్తుకెళ్లే దొంగలను కూడా చూసి ఉంటారు. కానీ.. ఇక్కడ మాత్రం వింతగా జంతువుల ఆర్గాన్స్‌‌ని మాత్రమే ఎత్తుకెళ్లారు. అది అడవి మనుషుల పని అయి ఉంటుంది. ఆర్గాన్స్‌‌ని తినడానికి ఎత్తుకెళ్తున్నారేమో అంటారా? కానీ.. వాళ్లు జంతువులను వేటాడిన ఆనవాళ్లు లేవు. కళేబరంపై ఒక్క గాయం లేకుండా, చిన్న రక్తపు బొట్టు కిందపడకుండా ఆర్గాన్స్‌‌ మాయమవడం చూసి ఆశ్చర్యపోయారు. లోతుగా తెలుసుకోవాలని ఎన్నో రీసెర్చ్‌‌లు చేశారు. కానీ.. ఆ రహస్యాన్ని మాత్రం తెలుసుకో లేకపోయారు.   

దెయ్యాల కోట!
ఇండియా అంటేనే వేల ఏళ్ల నాటి చరిత్ర, రాజ్యాలు, కోటలు గుర్తొస్తాయి. వాటిలో అందమైన కట్టడాలతోపాటు ఎన్నో అంతుచిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి రాజస్తాన్​లోని భంగర్‌‌‌‌ కోట. చీకటి పడ్డాక ఈ కోటలోకి వెళ్లి తిరిగి వచ్చినవాళ్లు చాలా అరుదని ఇక్కడివాళ్లు చెప్తుంటారు. 
రాజస్తాన్​లోని అల్వార్ జిల్లాలో రాజ్‌‌గఢ్​ దగ్గర్లోని సరిస్కా అటవీ సరిహద్దులో భంగర్ నగరం ఉండేది. అక్కడే ఈ భంగర్‌‌‌‌ కోట ఉంది. పగలంతా టూరిస్ట్‌‌లతో హడావిడిగా ఉంటుంది. చీకటి పడితే నిర్మానుష్యంగా మారుతుంది. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి రాత్రిపూట లోపలికి వెళ్తే అందులోని దెయ్యాలు వాళ్లను చంపేస్తాయని చెప్తుంటారు. ఈ కోటలో దెయ్యాలు ఉండడానికి కారణం.. ఓ సన్యాసి శాపం అని కొందరంటే.. ఓ మాంత్రికుడి శాపమని మరికొందరు అంటున్నారు. అసలు ఈ కోటలో దెయ్యాలున్నాయా? లేవా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఎంతోమంది రీసెర్చ్‌‌ చేశారు. అయినా.. ఆ గుట్టు విప్పలేకపోయారు. 
సన్యాసి శాపం
భంగర్‌‌‌‌ కోటను 1573లో రాజా భగవంత్‌‌ దాస్‌‌ కట్టారు. భంగర్‌‌‌‌ నగరాన్ని నిర్మించే టైంలో ఈ ప్రాంతంలో ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన ఇక్కడ నగరాన్ని కట్టేందుకు ఒప్పుకోలేదు. దాంతో  రాజభవనాల నీడలు అతని ఇల్లు మీద పడకూడదనే షరతు మీద నగరాన్ని నిర్మించడానికి ఒప్పుకున్నాడు. కానీ.. ఆ తర్వాత వచ్చిన రాజుల్లో ఒకరు ఈ ప్యాలెస్ ఎత్తు పెంచారు. అప్పుడు దాని నీడ సన్యాసి ఇల్లు మీద పడింది. దాంతో ఆయన వెంటనే ఆ కోట దెయ్యాలకు నివాసంగా మారాలని శపించాడు. అప్పటినుంచి రాత్రి పూట ఆ కోటలోకి ఎవరూ వెళ్లడం లేదు. 
మాంత్రికుడి శాపం
ఈ కోట చుట్టూ మరో కథ కూడా చక్కర్లు కొడుతోంది. భంగర్ యువరాణి రత్నావతి గొప్ప అందగత్తె. సింగియా అనే మాంత్రికుడు ఆమెను ఇష్టపడతాడు. స్వయంవరంలో ఆమెను గెలుచుకోవడం అసాధ్యమని తెలిసి.. ఆమెను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సంతలో ఆమె కొనాలనుకున్న నూనెపై మంత్రం వేశాడు. ఆమె ఆ నూనెను తాకితే సింగియాకు సొంతమయ్యేది.  కానీ.. మంత్రం చేయడం గమనించిన ఆమె నూనెను, ఒక బండ మీద పారబోసింది. దాంతో ఆ బండ ముక్కలై.. ఆ ముక్కలు సింగియాపై పడి చనిపోయాడు. చనిపోయే ముందు కోటను శపించాడు. ఆ శాపం వల్లే సంవత్సరం తర్వాత కోటపై శత్రువులు దాడి చేశారు. ఆ యుద్ధంలో యువరాణి రత్నవతి చనిపోయింది. ఆమెతోపాటు చనిపోయినవాళ్లంతా ఆ కోటలో దెయ్యాలుగా తిరుగుతున్నారని  చెప్తుంటారు. 

ఈ రెండు కథల ప్రకారం.. భంగర్‌‌ కోటలో దెయ్యాలున్నాయని అందరూ నమ్ముతారు. అందుకే చీకటి పడితే పశువులను కూడా ఇటువైపు రాకుండా చూసుకుంటారు. ఆరు దాటిన తర్వాత ఈ కోటలోకి వెళ్లేందుకు గవర్నమెంట్‌‌ కూడా పర్మిషన్‌‌ ఇవ్వడం లేదు. కాకపోతే దీనికి మరో కారణం ఉంది. ఈ కోటను ఆనుకుని టైగర్‌‌‌‌ రిజర్వ్‌‌ ఉంది. అందువల్లే సాయంత్రాల్లో దీన్ని విజిట్‌‌ చేయడానికి పర్మిషన్‌‌ ఇవ్వడంలేదు.