కర్నాటక ఎన్నికల వేళ.. భారీగా బయటపడుతున్న నోట్ల కట్టలు

కర్నాటక ఎన్నికల వేళ.. భారీగా బయటపడుతున్న నోట్ల కట్టలు

కర్నాటక ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో భారీగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఐటీశాఖ అధికారులు జరిపిన దాడుల్లో పెద్ద సంఖ్యలో నగదు కట్టలు బయటపడుతున్నాయి. 

మే 5వ తేదీ శుక్రవారం బెంగళూరు, మైసూరులోని పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రూ. 15 కోట్ల నగదు, రూ. 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం పట్టుబడ్డ సొమ్ము విలువ రూ.20 కోట్లు. 

బెంగళూరులోని శాంతి నగర్, కాక్స్ టౌన్, శివాజీనగర్, ఆర్‌ఎంవీ ఎక్స్‌టెన్షన్, కన్నింగ్‌హామ్ రోడ్, సదాశివ నగర్, కుమారపార్క్ వెస్ట్, ఫెయిర్‌ఫీల్డ్ లే అవుట్‌లలో ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 

మే 3వ తేదీన మైసూరులో ఓ చెట్టు కొమ్మల మధ్య దాచిన కోటి రూపాయలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేస్తున్న అశోక్‌ కుమార్‌ రాయ్‌ సోదరుడు కె. సుబ్రమణ్య రాయ్‌ నివాస ప్రాంగణంలో ఉన్న చెట్టు నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

పండ్లు (fruits ) పెట్టడానికి ఉపయోగించే పెట్టెల్లో రూ.500 కరెన్సీ నోట్ల కట్టలను దాచిపెట్టి, చెట్టు కొమ్మల మధ్య ఉంచినట్లు ఐటీశాఖ వర్గాలు తెలిపాయి. అయితే.. ఈ డబ్బు కాంగ్రెస్ అభ్యర్థిదా..? లేక ఇంకెవరిది అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

మే 10వ తేదీన కర్నాటక రాష్ట్రంలో ఒకే దశలో ఎలక్షన్స్ నిర్వహించనున్నారు.  మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. 224 మంది సభ్యులు ఉన్న కర్ణాటక అసెంబ్లీ పదవీకాలం మే 24వ తేదీతో ముగియనుంది.