కొత్త సెక్రటేరియెట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

కొత్త సెక్రటేరియెట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న ఉదయం 6 గంటల తర్వాత సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం1.20 నుంచి 1.30 మధ్య యాగం పూర్ణాహుతి చేస్తారు. ఆ వెంటనే కొత్త సెక్రటేరియెట్ ను సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తారు. నేరుగా 6వ అంతస్తులోని తన చాంబర్లో సీఎం కేసీఆర్ కూర్చుంటారు. మధ్యాహ్నం1.58 నుంచి 2.04 మధ్య మంత్రులు, ఆఫీసర్లు తమ చాంబర్లలో కూర్చుంటారు.

ఈ ఆరు నిమిషాల్లో ఒక ఫైల్ మీద సంతకం చేయాలని మంత్రులకు, అధికారులకు జీఏడీ స్పష్టం చేసింది. మధ్యాహ్నం 2.15కు సెక్రటేరియెట్ ప్రాంగణంలో గ్యాదరింగ్ ను ఉద్దేశించి సీఎం మాట్లాడతారు. ఇక మే ఒకటో తారీఖు సెలవు కావడంతో రెండో తేదీ నుంచి సీఎం, సీఎంఓ అధికారులు, మంత్రులు, సెక్షన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు కొత్త సెక్రటేరియెట్ నుంచే పూర్తిస్థాయి విధులు నిర్వహిస్తారు.  

ఒక్కో ఫ్లోర్​లో 3, 4 డిపార్ట్​మెంట్లు  కొత్త సెక్రటేరియెట్​లో ఏ డిపార్ట్​మెంట్ ఏ ఫ్లోర్​లో ఉండాలనే దానిపై సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కసరత్తు పూర్తి చేసింది.  ఈ నెల 27 నుంచి ఫైల్స్, కంప్యూటర్స్, జిరాక్స్ మెషీన్లు తరలించనున్నారు. ఒక్కో ఫ్లోర్​లో మూడు, నాలుగు శాఖలకు రూంలు కేటాయించారు. ఆరో ఫ్లోర్​లో సీఎం, సీఎంఓ, సీఎస్ ఆఫీస్ ఉండనుంది. ఐదో ఫ్లోర్ లో జీఏడీ, ఆర్​అండ్​బీ,  నాలుగో ఫ్లోర్​లో ఇరిగేషన్, లా, బీసీ వెల్ఫేర్, మూడో ఫ్లోర్​లో ఐటీ, మున్సిపల్, రెండో ఫ్లోర్​లో ఫైనాన్స్, ఫస్ట్ ఫ్లోర్​లో పంచాయతీరాజ్,  గ్రౌండ్​ ఫ్లోర్​లో రెవెన్యూ, ఎస్సీ డెవలప్​మెంట్ శాఖలకు ప్లేస్ అలాట్ చేశారు.