ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల డబుల్ డ్యూటీ అలవెన్స్ పెంపు

ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల  డబుల్ డ్యూటీ అలవెన్స్ పెంపు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్ జోన్​లో పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లకు డబుల్ డ్యూటీ అలవెన్స్​ను పెంచుతూ ఆర్టీసీ మేనేజ్ మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. డ్రైవర్​కు రూ.400, కండక్టర్ కు రూ. 350 పెంచామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సిబ్బంది రిటైర్ మెంట్లు, వీఆర్ఎస్​లు, సిక్  లీవుల్లో ఉండడం, అలాగే డ్రైవర్లు, కండక్లర్ల కొరత ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో  యాజమాన్యం వెల్లడించింది. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు,  సాయంత్రం 4 నుంచి 8 వరకు మినిమం 60 నుంచి 70 కి.మీ డ్యూటీకే ఈ అలవెన్స్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఆదేశాలపై డ్రైవర్లు, కండక్టర్లు ఫైర్ అవుతున్నారు. కార్మికుల శ్రమను మేనేజ్ మెంట్ ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలతో దోచుకుంటోందని వారు విమర్శించారు. ‘‘గ్రేటర్ హైదరాబాద్ లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఉంటది.

ఫుల్  డ్యూటీ చేస్తే  ప్రతి డ్రైవర్, కండక్టర్ కు రూ.750 ఇస్తున్నారు. ఇపుడు రెండు డ్యూటీలు (5 గంటలు)  చేస్తే రూ.400, రూ.350 ఇవ్వడం ఏంటి?”అని మండిపడుతున్నారు. ఈ రెండు డ్యూటీలు కూడా ట్రాఫిక్ వల్ల అదనంగా గంటన్నర లేట్ అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇపుడు ఇచ్చిన టైమింగ్స్ పీక్ అని, ఫుల్ ట్రాఫిక్ ఉండే టైమింగ్స్ అని వెల్లడించారు. ఇలాంటి ఉత్తర్వులు ఇస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నారని కూకుట్ పల్లి డిపోకు చెందిన ఓ డ్రైవర్  పేర్కొన్నాడు. ఖర్చులు తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఫైరయ్యారు. గతంలో యూనియన్లు ఉన్నపుడు వారిని  సంప్రదించి ఉత్తర్వులు ఇచ్చేవారని, వారు అంగీకరించకపోతే నిర్ణయాలు తీసుకునే వారు కాదని తెలిపారు. ఇప్పుడు యూనియన్లు లేకపోవడంతో అధికారులు వేధిస్తున్నారని ఆయన వాపోయారు.