- 5 వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్
- న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 296 ఆలౌట్
- అశ్విన్‌కు 3 వికెట్లు
- సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇండియా 14/1
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో టీమిండియా ఆధిపత్యమే కొనసాగుతున్నది..! శుక్రవారం మొత్తం పోరాడినా ఒక్క వికెట్ తీయలేకపోయిన మన బౌలర్లు.. శనివారం సూపర్ పెర్ఫామెన్స్‌తో చెలరేగిపోయారు..! లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ (5/62), ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (3/82) వేసిన స్పిన్ ఉచ్చులో కివీస్ విలవిలలాడిపోయింది..! దీంతో 151/0 స్కోరుతో పటిష్ట స్థితిలో కనిపించిన బ్లాక్ క్యాప్స్.. 296 రన్స్‌కు ఆలౌటైంది..! ఫలితంగా ఇండియాకు 49 రన్స్ లీడ్ లభించింది..! అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పటికే ఒక వికెట్ కోల్పోయిన మనోళ్లకు ఫోర్త్ డే ఆట కీలకం కానుంది..!!
కాన్పూర్: టెస్ట్ క్రికెట్లో అక్షర్ పటేల్ గోల్డెన్ ఫామ్ కొనసాగుతోంది. హోమ్ కండీషన్స్‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నడు. టెస్ట్ కెరీర్లో ఐదోసారి ఫైవ్ వికెట్ హాల్ సాధించి.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో టీమిండియాను డ్రైవింగ్ సీట్లో కూర్చొబెట్టిండు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ కూడా అండగా నిలవడంతో.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కివీస్ 142.3 ఓవర్లలో 296 రన్స్‌కే ఆలౌటైంది. టామ్ లాథమ్ (95) సెంచరీ మిస్ చేసుకోగా, విల్ యంగ్ (89) రాణించిండు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ఆట ముగిసే టైమ్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో 14/1 స్కోరు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (1) ఔటైనా, మయాంక్ అగర్వాల్ (4 బ్యాటింగ్), పుజారా (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 63 రన్స్ లీడ్‌లో కొనసాగుతున్నది.
లాథమ్ ఒక్కడే..
129/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన లాథమ్, యంగ్.. తొలి గంట మొత్తం నింపాదిగా ఆడారు. పిచ్‌లో పెద్దగా మార్పు లేకపోవడంతో అక్షర్, జడేజా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ అశ్విన్ మాత్రం మంచి టర్నింగ్తో చొచ్చుకుపోయాడు. ఫలితంగా 67వ ఓవర్లో అతను వేసిన ఫుల్ లెంగ్త్ బాల్.. యంగ్ బ్యాట్‌ను తాకుతూ కీపర్ భరత్ చేతుల్లోకి వెళ్లింది. బ్యాటర్ రివ్యూకు వెళ్లినా రిజల్ట్ ఇండియాకు అనుకూలంగా వచ్చింది. దీంతో కివీస్ 151 వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఈ దశలో వచ్చిన విలియమ్సన్ (18) అండగా నిలిచే ప్రయత్నం చేసిండు. లాథమ్, కేన్ డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చినా, అవసరమైనప్పుడల్లా బౌండ్రీలు బాదారు. అయితే 80 ఓవర్ల తర్వాత తీసుకున్న సెకండ్ న్యూబాల్ మరో వికెట్‌ను తెచ్చిపెట్టింది. ఉమేశ్ ఓ గుడ్ లెంగ్త్ బాల్‌తో విలియమ్సన్‌ను వికెట్ల ముందు దొరికించుకున్నడు. ఈ సెషన్లో 68 రన్స్ రావడంతో కివీస్ 197/2 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది.
99 రన్స్‌కే 8 వికెట్లు..
ఫస్ట్ సెషన్లో బాగా ఆడిన కివీస్‌కు లాస్ట్ రెండు సెషన్లలో మనోళ్లు దిమ్మతిరిగే షాక్‌లిచ్చారు. పోస్ట్ లంచ్ సెషన్లో అక్షర్ క్లాసిక్ లెఫ్టార్మ్ డెలివరీస్‌తో చెలరేగడంతో కివీస్ వికెట్ల పతనం కూడా వేగంగా సాగింది. ముందుగా సీనియర్ రాస్ టేలర్ (11)ను బోల్తా కొట్టించాడు. బాల్‌ను ఎక్కువగా ఎయిర్‌లో ఉంచి వేసిన గుడ్ లెంగ్త్‌ను టేలర్ డిఫెన్స్ చేయబోయాడు. కానీ లైన్ మిస్ కావడంతో బాల్.. బ్యాట్‌ను తాకుతూ డైరెక్ట్‌గా భరత్ చేతిలోకి వెళ్లింది. కొద్దిసేపటికే అక్షర్ వేసిన ఫుల్ లెంగ్త్ బాల్‌ను నికోల్స్ (2) స్వీప్ చేయబోయి వికెట్ల ముందు దొరికాడు. అప్పటికే సెంచరీకి దగ్గరగా వచ్చిన లాథమ్‌ను వెనక్కి పంపడంతో ఇండియా రేస్‌లోకి వచ్చింది. గుడ్ స్పీడ్‌తో వచ్చిన బాల్‌ను లాథమ్ ముందుకొచ్చి ఆపే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే బాల్ భరత్ చేతుల్లోకి వెళ్లడంతో స్టంపౌట్ తప్పలేదు. ఛేంజ్ బౌలర్‌గా వచ్చిన జడేజా.. రాచిన్ (13)ను పెవిలియన్‌కు చేర్చడంతో కివీస్ 249/6తో టీ బ్రేక్‌కు వెళ్లింది. ఇక లాస్ట్ సెషన్లోనూ అక్షర్ హవానే సాగింది. టామ్ బ్లండెల్ (13), జెమీసన్ (23) డెడ్ డిఫెన్స్‌తో వికెట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ రన్స్ జోడించలేక పోయారు. సౌథీ (5), సోమర్విల్లే (6) నిరాశపర్చారు. ఈ నలుగురు కలిసి 47 రన్స్ జోడించారు. ఈ నాలుగు వికెట్లనూ అక్షర్, అశ్వినే పంచుకున్నారు. ఓవరాల్‌గా రెండు సెషన్లలో కలిపి 99 రన్స్‌కు 8 వికెట్లు పడ్డాయి.
అక్షర్ రికార్డు
డెబ్యూ టెస్టు నుంచి ఆడిన ప్రతి మ్యాచ్‌లో ప్రతిసారి ఐదు వికెట్లు హాల్ సాధించిన థర్డ్ బౌలర్‌గా అక్షర్ పటేల్ రికార్డు సృష్టించాడు. టెస్టు హిస్టరీలో చార్టీ టర్నర్ (1887), టామ్ రిచర్డ్సన్ (1893) ఫస్ట్, సెకండ్ ప్లేసుల్లో ఉన్నారు. ఇక ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం అక్షర్‌కు ఇది ఐదోసారి.
స్కోరు బోర్డు
ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్: 345 ఆలౌట్
న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: లాథమ్ (స్టంప్) (సబ్) కేఎస్ భరత్ (బి) అక్షర్ 95, విల్ యంగ్ (సి) (సబ్) భరత్ (బి) అశ్విన్ 89, విలియమ్సన్ (ఎల్బీ) ఉమేశ్ 18, రాస్ టేలర్ (సి) (సబ్) భరత్ (బి) అక్షర్ 11, హెన్రీ నికోలస్ (ఎల్బీ) అక్షర్ 2, బ్లండెల్ (బి) అక్షర్ 13, రాచిన్ రవీంద్ర (బి) జడేజా 13, జెమీసన్ (సి) పటేల్ (బి) అశ్విన్ 23, సౌథీ (బి) అక్షర్ 5, సోమర్విల్లే (బి) అశ్విన్ 6, అజాజ్ పటేల్ (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 16, మొత్తం: 142.3 ఓవర్లలో 296 ఆలౌట్.
వికెట్లపతనం: 1–151, 2–197, 3–214, 4–218, 5–227, 6–241, 7–258, 8–270, 9–284, 10–296. బౌలింగ్: ఇషాంత్ 15–5–35–0, ఉమేశ్ యాదవ్ 18–3–50–1, అశ్విన్ 42.3–10–82–3, జడేజా 33–10–57–1, అక్షర్ పటేల్ 34–6–62–5.
ఇండియా సెకండ్ ఇన్నింగ్స్: మయాంక్ (బ్యాటింగ్) 4, గిల్ (బి) జెమీసన్ 1, పుజారా (బ్యాటింగ్) 9, మొత్తం: 5 ఓవర్లలో 14/1. వికెట్లపతనం: 1–2, బౌలింగ్: సౌథీ 2–1–2–0, జెమీసన్ 2–0–8–1, అజాజ్ పటేల్ 1–0–4–0.