రాయ్‌పూర్: టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బాల్స్‌లో 9 ఫోర్లతో 4 సిక్స్‌లతో 82 నాటౌట్) చాలా రోజుల తర్వాత తన టీ20 మార్క్ ఆటను చూపెట్టాడు. ఇషాన్ కిషన్ (32 బాల్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76) కూడా బ్యాట్ ఝుళిపించడంతో.. శుక్రవారం జరిగిన రెండో టీ20లోనూ ఇండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గ్రాండ్ విక్టరీ సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హోమ్ టీమ్ 2–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 208/6 స్కోరు చేసింది. మిచెల్ శాంట్నర్ (27 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 47 నాటౌట్), రచిన్ రవీంద్ర (26 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44) రాణించారు. తర్వాత ఇండియా15.2 ఓవర్లలోనే209/3 స్కోరు చేసి గెలిచింది. ఇషాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 ఆదివారం గువాహటిలో జరుగుతుంది.
రచిన్, శాంట్నర్ మెరుపులు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు డెవాన్ కాన్వే (19), టిమ్ సిఫర్ట్ (24) మెరుపు ఆరంభాన్నిచ్చారు. అర్ష్‌దీప్ వేసిన తొలి ఓవర్‌లో కాన్వే మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. తర్వాతి ఓవర్‌లో పాండ్యా ఒక ఫోర్‌తో సరిపెట్టగా.. మూడో ఓవర్‌లో సిఫర్ట్ నాలుగు ఫోర్లతో రెచ్చిపోయాడు. అయితే హర్షిత్ రాణా (1/35) తన తొలి ఓవర్‌లోనే కాన్వేను ఔట్ చేసి తొలి వికెట్‌కు 43 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. ఐదో ఓవర్‌లో వరుణ్ చక్రవర్తి (1/35).. సిఫర్ట్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆరు బాల్స్ తేడాలో ఈ ఇద్దరూ ఔట్ కావడంతో కివీస్ 43/2 స్కోరుతో నిలిచింది. ఈ దశలో వచ్చిన రచిన్ 6, 4, 6 దంచాడు. దాంతో పవర్‌ప్లేలో కివీస్ 64/2 స్కోరు చేసింది. రెండో ఎండ్‌లో ఫిలిప్స్ (19) సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. 8వ ఓవర్‌లో రచిన్ రెండు సిక్స్‌లు కొడితే.. కుల్దీప్ (2/35) వేసిన 9వ ఓవర్‌లో ఫిలిప్స్ 6, 4, 6 బాదాడు. కానీ ఐదో బాల్‌కు భారీ షాట్ కొట్టబోయి బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో హార్దిక్ చేతికి చిక్కాడు. డారిల్ మిచెల్ (18) రెండు ఫోర్లతో టచ్‌లోకి రావడంతో ఫస్ట్ టెన్‌లో కివీస్ 111/3 స్కోరుతో మంచి స్థితిలో కనిపించింది. ఇక్కడి నుంచి వరుణ్ రన్స్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. 12వ ఓవర్‌లో ఓ ఫోర్ ఇచ్చి మిచెల్ వికెట్ తీసిన దూబే (1/7) కూడా మెరుగ్గా బౌలింగ్ చేశాడు. రచిన్‌తో జతకలిసిన చాప్‌మన్ (10) బ్యాట్ ఝుళిపించలేకపోయాడు. 13వ ఓవర్‌లో కుల్దీప్.. రాచిన్‌ను ఔట్ చేయడంతో న్యూజిలాండ్ 129/5తో నిలిచింది. ఈ టైమ్‌లో శాంట్నర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. చాప్‌మన్ స్ట్రయిక్ రొటేట్ చేయగా శాంట్నర్ భారీ షాట్లు కొట్టాడు. 17వ ఓవర్‌లో హార్దిక్.. చాప్‌మన్‌ను వెనక్కి పంపాడు. అయినా 18వ ఓవర్‌లో 6, 4, 4 కొట్టిన శాంట్నర్ తర్వాతి ఓవర్‌లో 4, 4, 4, బాదాడు. ఆఖరి ఓవర్‌లో ఫౌల్క్స్ (15 నాటౌట్) 4, 6, 4 దంచడంతో కివీస్ స్కోరు రెండొందలు దాటింది.
ఓపెనర్లు ఫట్టు.. ఇషాన్, సూర్య హిట్టు
భారీ ఛేజింగ్‌లో ఇండియాకు సరైన ఆరంభం దక్కలేదు. తొలి 7 బాల్స్‌లోనే సంజూ శాంసన్ (6), అభిషేక్ శర్మ (0) పెవిలియన్‌కు వచ్చేశారు. 6/2 వద్ద వచ్చిన ఇషాన్, సూర్య కివీస్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నారు. మూడో ఓవర్లో ఇషాన్ 4, 4, 4, 6తో 24 రన్స్ దంచాడు. తర్వాతి ఓవర్‌లో మరో రెండు ఫోర్లు, ఐదో ఓవర్‌లో మూడు ఫోర్లు బాదాడు. ఆరో ఓవర్‌లో సూర్య సిక్స్ కొడితే, ఇషాన్ 6, 4తో 21 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇండియా పవర్‌ప్లేను 75/2తో ముగించింది. ఇక్కడి నుంచి మరింత వేగంగా ఆడిన ఇషాన్ 4, 6, 6తో రెచ్చిపోయాడు. ఆ వెంటనే సూర్య ఐదు ఫోర్లు, ఓ సిక్స్ దంచాడు. అయితే 10వ ఓవర్‌లో సోధీ బౌలింగ్‌లో ఇషాన్ ఔట్ కావడంతో మూడో వికెట్‌కు 122 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ దశలో వచ్చిన శివం దూబే (32 నాటౌట్) స్ట్రయిక్ రొటేట్ చేయడంతో పాటు వీలైనప్పుడల్లా భారీ షాట్లు కొట్టాడు. రెండో ఎండ్‌లో సూర్య సిక్స్‌తో 23 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దాదాపు 24 ఇన్నింగ్స్ తర్వాత ఈ ఫీట్‌ను సాధించాడు. ఇక్కడి నుంచి ఇద్దరూ పోటీ పడి ఫోర్లు, సిక్స్‌లు బాదడంతో నాలుగో వికెట్‌కు 37 బాల్స్‌లోనే 81 రన్స్ జతయ్యాయి. దాంతో మరో 28 బాల్స్ మిగిలి ఉండగానే ఇండియా ఈజీగా విజయాన్ని అందుకుంది. హెన్రీ, డఫీ చెరో వికెట్ తీశారు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 20 ఓవర్లలో 208/6 (శాంట్నర్ 47*, రచిన్ 44, కుల్దీప్ 2/35).
ఇండియా: 15.2 ఓవర్లలో 209/3 (సూర్య 82*, ఇషాన్ 76, దూబే 32*, ఇష్ సోధీ 1/34).
1 టీ20ల్లో ఇండియాకు ఇది హయ్యెస్ట్ సక్సెస్‌ఫుల్ టార్గెట్ ఛేజింగ్. 2023లో వైజాగ్‌లో ఆస్ట్రేలియాపై 209 రన్స్ ఛేజ్
చేసిన రికార్డును సమం చేసింది.
28 ఈ మ్యాచ్‌లో ఇండియా మరో 28 బాల్స్ మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఓ ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టుపై 200 ప్లస్ టార్గెట్ ఛేజింగ్‌లో ఎక్కువ బాల్స్ మిగిలుండగానే గెలిచిన టీమ్‌గా రికార్డుకెక్కింది.
