టోక్యో ఒలింపిక్స్ భారత్‌కు మరో మెడల్

టోక్యో ఒలింపిక్స్ భారత్‌కు మరో మెడల్

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరో మెడల్ సొంతం చేసుకుంది. రెజ్లింగ్ బ్రాంజ్ మెడల్‌ మ్యాచ్‌లో మన కుస్తీ వీరుడు బజ్‌రంగ్‌ పునియా తిరుగులేని విజయం సాధించాడు. 65 కిలోల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించాడు. శనివారం సాయంత్రం కజఖ్‌స్తాన్‌కు చెందిన దౌలెట్‌ నియాజ్‌బెకోవ్‌పై జరిగిన ఈ మ్యాచ్ అంతా వార్‌‌ వన్‌ సైడ్‌ అన్నట్టు సాగింది. దౌలెత్‌పై 8–0 ఆధిపత్యంతో బజ్‌రంగ్‌ గెలుపొందాడు. బజ్‌రంగ్ సాధించిన బ్రాంజ్ మెడల్‌తో భారత్‌కు మొత్తం ఆరు పతకాలు వచ్చాయి. ఇప్పటి వరకు రెండు సిల్వర్ మెడల్స్, నాలుగు బ్రాంజ్ మెడల్స్‌ను మన అథ్లెట్స్ గెలుచుకున్నారు.

కాగా, రెజ్లింగ్‌లో భారత్‌కు ఇది రెండో మెడల్. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్స్ లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా సిల్వర్ మెడల్ సాధించాడు. భారత్ ఖాతాలో మరో పతకం చేర్చాడు. 57కేజీల విభాగంలో.. రష్యన్ రెజ్లర్.. జౌ రొగేవ్ తో జరిగిన ఫైనల్స్ లో.. 7-4తేడాతో రవి కుమార్ ఓడిపోయాడు. రష్యన్ రెజ్లర్ కు తీవ్రంగా పోటీ ఇచ్చాడు రవికుమార్. 9 ఏళ్ల తర్వాత.. రెజ్లింగ్ లో భారత్ తరపున ఫైనల్స్ కు చేరిన రెండో ఆటగాడిగా రవి కుమార్ దహియా రికార్డ్ సృష్టించాడు.