న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ టెన్నిస్ టోర్నీలో ఇండియా రెండో విజయంసాధించింది. ఆసియా/ఓసియానియా గ్రూప్–1 పోరులో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇండియా 3–0తో మంగోలియాపై నెగ్గింది. తొలి సింగిల్స్‌లో అరంగేట్రం ప్లేయర్ జీల్ దేశాయ్ 6–0, 6–0తో అను విజిన్ గాంటోర్‌ను చిత్తు చేసింది. 37 నిమిషాల మ్యాచ్‌లో ఇండియా ప్లేయర్ వరుస పాయింట్లతో హోరెత్తించింది.
రెండో సింగిల్స్‌లో తెలంగాణ అమ్మాయి యమలపల్లి సహజ 6–0, 6–0తో జర్గల్ ను చిత్తు చేసింది. బలమైన సర్వీస్‌లతో చెలరేగిన సహజ ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా 42 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. డబుల్స్‌లో వైష్ణవి అడ్కర్–రుతుజా భోసలే 6–1, 6–0తో కంగోర్జుల్–జర్గల్‌పై గెలిచారు. శనివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఇండియా.. కొరియాతో తలపడుతుంది.
