ఆసియా కప్‌‌ గెలుస్తాం: సెహ్వాగ్‌‌

ఆసియా కప్‌‌ గెలుస్తాం: సెహ్వాగ్‌‌

న్యూఢిల్లీ: సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ అద్భుత కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్‌‌ గెలుస్తుందని మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌‌ మద్దతిచ్చాడు. మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టు సమతుల్యంతో ఉందన్నాడు. ‘జట్టులో యూత్‌‌, ఎక్స్‌‌పీరియెన్స్‌‌ సమపాళ్లలో ఉంది. దీనికి తోడు సూర్యకుమార్‌‌ నిర్భయమైన కెప్టెన్సీలో ఆసియా కప్‌‌లో ఆధిపత్యం చెలాయిస్తామని ఆశిస్తున్నా. సూర్య ఎటాకింగ్‌‌ మైండ్‌‌సెట్‌‌ టీ20 ఫార్మాట్‌‌కు సరిగ్గా సరిపోతుంది. జట్టు కూడా అదే లక్ష్యంతో ఆడితే ఈజీగా ట్రోఫీని గెలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని ఈ టోర్నీ కోసం బ్రాడ్‌‌కాస్టర్స్‌‌ ఏర్పాటు చేసిన ‘రాగ్‌‌రాగ్‌‌ మే భారత్‌‌’ కార్యక్రమంలో సెహ్వాగ్‌‌ పేర్కొన్నాడు. 

ఈ ప్రచారం ఇండియన్‌‌ క్రికెట్‌‌ హృదయ స్పందనను తెలియజేస్తుందన్నాడు. ‘దేశంలోని ఏ ప్రాంతానికి చెందినవారైనా టీమిండియాకు ఆడేటప్పుడు భావోద్వేగాలు మనల్ని ఏకం చేస్తాయి. సినిమాలో కూడా నేను అదే అభిరుచిని అనుభవించాను. క్రికెట్‌‌ కూడా దీన్ని మరింత శక్తివంతం చేస్తుంది’ అని వీరూ వ్యాఖ్యానించాడు. వచ్చే నెల 9 నుంచి 28 వరకు యూఏఈలో జరిగే టోర్నీలో ఇండియా గ్రూప్‌‌–ఎలో పాకిస్తాన్‌‌, ఒమన్‌‌, యూఏఈతో తలపడుతుంది.