సెమీస్లో భారత్‌‌‌‌‌‌‌‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ

సెమీస్లో భారత్‌‌‌‌‌‌‌‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ

హోర్సెన్స్ (డెన్మార్క్): థామస్ కప్ సెమీఫైనల్స్​లో ఫ్రాన్స్​తో తలపడుతున్న భారత్‌‌‌‌‌‌‌‌కు ఆరంభంలోనే చుక్కెదురైంది. శనివారం జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆయుష్ శెట్టి ప్రపంచ నాలుగో ర్యాంకర్ క్రిస్టో పోపోవ్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యాడు. దీంతో భారత్ 0-–1తో వెనుకంజలో పడింది. 

లక్ష్యసేన్ కుడి మోచేయి వాపుతో ఇబ్బంది పడుతుండడంతో అనూహ్యంగా తొలి సింగిల్స్ బరిలోకి దిగిన 20 ఏళ్ల ఆయుష్, ప్రత్యర్థి వ్యూహాత్మక ఆటకు తలవొగ్గి 11-21, 9-21 తేడాతో కేవలం 39 నిమిషాల్లోనే ఓటమి చవిచూశాడు. 2024 హైలో ఓపెన్ తర్వాత పోపోవ్ చేతిలో ఆయుష్‌‌‌‌‌‌‌‌కు ఇది రెండో ఓటమి. మ్యాచ్ ప్రారంభం నుంచే పోపోవ్ పూర్తి ఆధిక్యం ప్రదర్శించాడు. కోర్టు నలుమూలల బంతిపై పట్టు సాధించి ఆదిలోనే 8-–3తో ముందంజ వేశాడు.

ఆయుష్ కొన్ని క్రాస్ కోర్ట్ స్మాష్‌‌‌‌‌‌‌‌లతో ప్రతిఘటించినా, ఒత్తిడిలో కొనసాగించలేకపోయాడు. విరామ సమయానికి 11-6తో ఉన్న పోపోవ్.. ఆ తర్వాత తన వేగాన్ని మరింత పెంచి 15-6కు దూసుకెళ్లాడు. ఆయుష్ చేసిన అనవసర తప్పిదాలను సొమ్ము చేసుకున్న ఫ్రాన్స్ క్రీడాకారుడు తొలి గేమ్‌‌‌‌‌‌‌‌ను సులువుగా గెలుచుకున్నాడు. రెండో గేమ్‌‌‌‌‌‌‌‌లోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. 

పోపోవ్ ఆదిలోనే 4-1తో ఆధిక్యంలోకి వెళ్లి ఆయుష్ బ్యాక్‌‌‌‌‌‌‌‌హ్యాండ్ బలహీనతను లక్ష్యంగా చేసుకున్నాడు. విరామ సమయానికి 11-2తో భారీ ఆధిక్యం సాధించి తిరుగులేని పట్టు బిగించాడు. చివర్లో ఆయుష్ పుంజుకునే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైంది. వరుస పాయింట్లతో విరుచుకుపడిన పోపోవ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ముగించాడు.