- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో గవర్నర్ తమిళ సై సౌందర రాజన్
వరంగల్ అర్బన్ : కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అనేక విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా మన భారత దేశం మొత్తం ప్రపంచానికే దిక్సూచిగా మారిందని గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ చెప్పారు.హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జాతీయ జెండా ను ఎగురవేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళ సై మాట్లాడారు. 75 సంవత్సరాలలో భారత దేశం అనేక సవాళ్లను ఎదుర్కొని ఎంతో ప్రగతి సాధించిందన్నారు. కరోనా కష్టకాలం ఎదుర్కొని ప్రపంచానికి భారతదేశం దిక్సూచి గా మారిందని, కరోనా వ్యాక్సిన్ కనుక్కొని అనేక దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళులు అర్పించి... స్మరించుకోవడాని ప్రధాని అజాది కా అమృత్ మహోత్సవం మొదలు పెట్టారని ఆమె తెలిపారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసే అవకాశం అందరికి రాదు, కానీ దేశ ప్రగతి కోసం పాటుపడే అవకాశం అందరికి వస్తుంది, ప్రధాని మోదీ నేతృత్వం లో 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించాలన్నదే లక్ష్యంగా కృషి చేస్తున్నారని వివరించారు. ఈ ఉత్సవాలు 100 ఏళ్ల స్వతంత్ర భారత నిర్మాణానికి విజన్ రూపకల్పన కు దోహద పడాలన్నారు. దేశ ప్రగతి కోసం మనం అందరం పాటుపడాలని ఆమె పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరుల త్యాగాలు మరువలేనివని, వారి స్ఫూర్తితో దేశ ప్రగతి కోసం పాటుపడదామని కోరారు.

