V6 News

థామస్ కప్ క్వార్టర్ ఫైనల్.. చైనీస్ తైపీతో ఇండియా ఢీ

థామస్ కప్ క్వార్టర్ ఫైనల్.. చైనీస్ తైపీతో ఇండియా ఢీ

హార్సెన్స్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్ కప్ ఫైనల్స్‌‌ బ్యాడ్మింటన్‌‌ టోర్నమెంట్‌‌లో ఇండియా మెన్స్‌‌ టీమ్‌‌ కీలక సవాల్‌‌కు రెడీ అయింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌‌లో బలమైన చైనీస్ తైపీతో తలపడనుంది. నాలుగేండ్ల కిందట తొలిసారి థామస్‌‌ ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిన అబ్బాయిల టీమ్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. గ్రూప్-ఎలో రెండో స్థానంలో నిలిచిన ఇండియా లీగ్ దశలో  4-1తో కెనడాపై, 5-0తో ఆస్ట్రేలియాపై ఘనవిజయాలు సాధించింది. కానీ, చివరి పోరులో మాత్రం చైనా చేతిలో 2-3 తేడాతో  ఓటమిపాలైంది.

యంగ్ సెన్సేషన్ ఆయుష్ శెట్టి ఆడిన మూడు మ్యాచ్‌‌ల్లోనూ విజయాలు సాధించి మంచి ఫామ్‌‌లో ఉన్నాడు.  చివరి రెండు మ్యాచ్‌‌ల్లో ఓడినప్పటికీ తన పోరాటస్ఫూర్తితో లక్ష్యసేన్‌‌ ఆకట్టుకున్నాడు. స్టార్టింగ్‌‌లో ఆయుష్‌‌, లక్ష్య రాణిస్తే జట్టు అవకాశాలు మెరుగవుతాయి.

ఇక, వెటరన్ షట్లర్లు హెచ్‌‌ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ థర్డ్ సింగిల్స్ బాధ్యత తీసుకుంటున్నారు. డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిపై భారీ అంచనాలు ఉన్నాయి.  మరోవైపు గ్రూప్‌‌–సి టాపర్‌‌‌‌ అయిన చైనీస్ తైపీ టీమ్‌‌ బలంగా ఉంది.  ఆరో ర్యాంకర్  చౌ తైన్‌‌ చెన్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ లిన్ చున్ -యి వంటి స్టార్లతో ఇండియా షట్లర్లకు కఠిన సవాల్ ఎదురవనుంది.