భారత్ - పాక్ మధ్య వరల్డ్ కప్ ప్రోమో చిచ్చు.. మ్యాచ్ జరిగేనా?

భారత్ - పాక్ మధ్య వరల్డ్ కప్ ప్రోమో చిచ్చు.. మ్యాచ్ జరిగేనా?

వన్డే ప్రపంచ కప్‌కు సమయం దగ్గరపడుతోంది. అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఇదిలావుంటే ఈ టోర్నీని ఉద్దేశిస్తూ ఐసీసీ విడుదల చేసిన వరల్డ్ కప్ ప్రోమో.. ఇరు దేశాల మధ్య చిచ్చు పెడుతోంది.

2 నిమిషాల 13 సెకన్ల నిడివిగల వరల్డ్ కప్ ప్రోమోను.. ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఇందులో ఐసీసీ చారిత్రాత్మక ప్రపంచ కప్ గత చరిత్రను వెలికితీసింది. ఎమోషనల్ మూమెంట్స్‌తో పాటు ఎన్నో మధురక్షణాలను పంచుకుంది. ధోనీ రన్ ఔట్ అయిన క్షణాన్ని, 2011 ప్రపంచ కప్‌లో శ్రీలంకపై ధోనీ కొట్టిన సిక్సర్‌ని చూపించి టోర్నీపై మరింత ఆసక్తిని పెంచారు. అయితే ఇన్ని ఉన్నప్పటికీ.. ఇందులో దాయాది జట్టు పాకిస్తాన్ ప్రస్తావన లేకపోవటం ఆ దేశ అభిమానులకు ఆగ్రహాన్నితెప్పించింది.

ఈ వీడియోపై పాక్ క్రికెట్ ఫ్యాన్స్ తమ వ్యతిరేకతను తెలుపుతుండగా.. భారత అభిమానులు అదే రీతిలో బదులిస్తున్నారు. అయితే ఓ క్రికెట్ అభిమాని చూపించిన అత్యుత్సాహం.. ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి తీసుకెళ్లింది. "పాకిస్తాన్‌ను ఓడించటానికి 8 గంటలు మాత్రమే పడుతుంది.." అంటూ ఓ నెటిజెన్ పెట్టిన ట్వీట్ నెట్టింట నానా రచ్చకు కారణమవుతోంది. దీనికి పాక్ అభిమానులు.. టీమిండియా గత ఓటములను జత చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మాకు ఆ సమయం కూడా పట్టదంటూ కొందరు, 36 పరుగులకు ఆలౌట్ అయ్యే జట్టు మీదేనంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. 

పాక్ వచ్చేనా..?

మరోవైపు పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్ 2023 పర్యటనకు వస్తుందా! అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. పాక్ జట్టు పర్యటన ఆ దేశ ప్రభుత్వం చేతుల్లో ఉందని స్పష్టం చేసింది. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికే ఓ అత్యున్నత కమిటీ ఏర్పాటు చేసిన పాక్ ప్రధాని జకా అష్రఫ్.. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే  తుది నిర్ణయం తీసుకోనున్నారు.