వెన్న వంటి డెయిరీ ప్రొడక్టులను.. విదేశాల నుంచి కొనం : పురుషోత్తం రూపాలా

వెన్న వంటి డెయిరీ ప్రొడక్టులను.. విదేశాల నుంచి కొనం  : పురుషోత్తం రూపాలా

 

  • వెన్న వంటి డెయిరీ ప్రొడక్టులను..
  • విదేశాల నుంచి కొనం దేశంలోనే మరింతగా తయారు చేస్తం
  • స్పష్టం చేసిన కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా


న్యూఢిల్లీ:  వెన్న, నెయ్యి వంటి డెయిరీ ప్రొడక్టులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోబోమని కేంద్ర ఫిషరీస్, యానిమల్​ హస్బెండరీ, డెయిరీ శాఖల మంత్రి పురుషోత్తం రూపాలా ప్రకటించారు. దేశంలోనే వీటి ఉత్పత్తిని మరింతగా పెంచుతామని స్పష్టం చేశారు. చాలా ప్రాంతాల్లో నెయ్యికి, వెన్నకు చాలా కొరత ఉందని, వీటిని దిగుమతి చేసుకునే పరిస్థితి రావొచ్చని ఈశాఖ సీనియర్​ ఆఫీసర్​ ఒకరు పోయిన వారం అన్నారు. పశువులకు లంపీస్కీన్​ వ్యాధి రావడం వల్ల పాల ఉత్పత్తి యదాతథంగా ఉంటుందని, పెరిగే అవకాశం లేదని ప్రకటించడంతో రూపాల ఈ వివరణ ఇచ్చారు. ‘‘డెయిరీ ప్రొడక్టులకు కొరత ఏమీ లేదు. దిగుమతులు ఉండవు. పాల ఉత్పత్తిని మేం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. పాలకు డిమాండ్​ పెరుగుతూనే ఉంది. దీని ఉత్పత్తిని పెంచడానికి మనదేశంలోనే చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆందోళన అవసరం లేదు” అని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వివరించారు. డెయిరీ ప్రొడక్టుల ధరలు విపరీతంగా పెరగడంపై మాట్లాడుతూ దీని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని, రైతుల ఆదాయం పెరుగుతోందని అన్నారు. 

తగ్గిన ఉత్పత్తి..

ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2021–-22లో భారతదేశపు పాల ఉత్పత్తి 221 మిలియన్ టన్నులు కాగా, అంతకుముందు సంవత్సరంలో ఇది 208 మిలియన్ టన్నులు.  మాజీ వ్యవసాయ మంత్రి,  ఎన్​సీపీ నాయకుడు శరద్ పవార్ పోయిన వారం ప్రధానికి ఈ విషయమై ఒక లెటర్​ రాశారు. పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవద్దని, దీనివ్లల దేశీయ పాల ఉత్పత్తిదారుల ఆదాయం తగ్గుతుందని పేర్కొన్నారు. మనదేశం చివరిగా 2011లో పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది.  జంతువుల నుంచి మానవులకు సంక్రమించే   వ్యాధులను నియంత్రించడానికి రూపాలా ఈ సందర్భంగా రెండు జంతు ఆరోగ్య కార్యక్రమాలను ప్రారంభించారు. వీటిలో ఒకటి -- యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్‌‌‌‌నెస్ ఇనీషియేటివ్ (ఏపీపీఐ) ఒకటి  కాగా, రెండోది  ప్రపంచ బ్యాంకు నిధులతో వన్ హెల్త్ కోసం యానిమల్ హెల్త్ సిస్టమ్ సపోర్ట్ (ఏహెచ్​ఎస్​ఎస్​ఓహెచ్​).   డిజిటల్ నిఘా ద్వారా జంతు వ్యాధులను పరిశీలించడం,  అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సాయం అందించడానికి ఏపీపీఐని మొదలుపెట్టారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు  1,228 కోట్ల రూపాయలు కేటాయిస్తుంది. ఈ​ ప్రాజెక్టును మొదట్లో అస్సాం, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్  మహారాష్ట్రలలో అమలు చేస్తారు. ఏహెచ్​ఎస్​ఎస్​ఓహెచ్​ ప్రాజెక్ట్  ద్వారా75 జిల్లాల్లో ప్రయోగశాలలను బలోపేతం చేయడం, మారుమూల ప్రాంతాల్లో,  -ప్రమాదకర ప్రాంతాలలో 100 మొబైల్ వెటర్నరీ యూనిట్లను ఏర్పాటు చేయడం,  5,500 మంది పశువుల డాక్టర్లను నియమించడం,  9,000 మంది ప్రైవేట్ డయాగ్నస్టిక్ నిపుణులకు శిక్షణ  ఇవ్వడంతో పాటు 300 డిస్పెన్సరీలు  ఆసుపత్రులను అప్‌‌‌‌గ్రేడ్ చేయడం వంటి కార్యక్రమాలను చేపడతారని రూపాలా వివరించారు.   

ధరల దడ 

పాల ధరలు విపరీతంగా పెరిగిపోవడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారవచ్చని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.  పాల సగటు రిటైల్ ధర పోయిన సంవత్సరం నుంచి 12 శాతం పెరిగి లీటరుకు 57.15 రూపాయలకు (0.6962 డాలర్లు) చేరింది. కరోనా కారణంగా పాలకు డిమాండ్​ పడిపోయింది.  ఆ సమయంలో ఆవులకు తగినంత దాణా కూడా అందించకపోవడంతో దిగుబడి తగ్గింది. ధాన్యాల ధర మరింత ఖరీదైనదిగా మారింది. మనదేశంలో పాల ధరల పెరుగుదల ఇన్​ఫ్లేషన్​ను పెంచుతుంది. ప్రస్తుతం మిల్క్​ ఇన్​ఫ్లేషన్​  9.31 శాతం వరకు ఉంది. మనదేశంలో దాదాపు ప్రతి కుటుంబమూ పాలను వాడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో నెయ్యి, వెన్నలను కూడా విరివిగా వాడతారు.  పాల కొనుగోలు ఖర్చులు పెరుగుతూనే ఉండటంతో డెయిరీ కంపెనీల బ్యాలెన్స్ షీట్స్ ​కూడా ఒత్తిడికి లోనవుతున్నాయి. ధాన్యాలు,  బియ్యం ఊక, పశుగ్రాసం ధరలు పెరగడం చలికాలంలో పాల ధరలు 12శాతం–-15శాతం పెరిగాయి. దాదాపు అన్ని బ్రాండ్లు తమ డెయిరీ ప్రొడక్టుల ధరలను పెంచాయి.