IND vs ENG 3rd Test: 10 మంది ప్లేయర్లతోనే టీమిండియా.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

IND vs ENG 3rd Test: 10 మంది ప్లేయర్లతోనే టీమిండియా.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు నుంచి ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్  ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. రెండో టెస్ట్ ఆట ముగిసిన తర్వాత చెన్నైకి చేరుకున్నాడు. దీంతో భారత్ కు ఈ టెస్ట్ మ్యాచ్ లో భారీ దెబ్బ తగలనుంది. ఈ వెటరన్ ప్లేయర్ లేకపోవడంతో రాజ్ కోట్ టెస్టులో భారత్ 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అశ్విన్ స్థానంలో మరో ఆటగాడికి మ్యాచ్ లో ఆడే ఛాన్స్ ఉంటుందా..? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. 

రాజ్ కోట్ టెస్ట్ మూడో రోజు ఆటలో భాగంగా అశ్విన్ లేకపోవడంతో కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి ఎంపికైన దేవదత్ పడిక్కల్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా అడుగుపెట్టాడు. ఇదిలా ఉండగా.. పడిక్కల్ కేవలం ఫీల్డింగ్ కే పరిమితం కానున్నాడు. అశ్విన్ స్థానంలో ఫీల్డింగ్ కు వచ్చినా.. బ్యాటింగ్ గాని బౌలింగ్ గాని చేయడానికి రూల్స్ అనుమతించబడవు.
 
MCC 24.1 రూల్ ప్రకారం ప్రధాన జట్టులోని ఫీల్డర్ గాయం లేదా ఏదైనా ఇతర పరిస్థితుల కారణంగా వైదొలిగితే అంపైర్లు ప్రత్యామ్నాయ ఫీల్డర్‌ను అనుమతించవచ్చని స్పష్టంగా పేర్కొంది. ఫీల్డ్ లో బ్యాటింగ్ చేయడం.. బౌలింగ్ వేయడం.. కెప్టెన్‌గా వ్యవహరించడం సాధ్యం కాదని స్పష్టంగా చెబుతుంది. అంపైర్ల సమ్మతితో మాత్రమే వికెట్ కీపింగ్ చేయవచ్చు. 

అశ్విన్ లేకపోవడంతో భారత్ నలుగురు బౌలర్లతోనే ఈ మ్యాచ్ ఆడనుంది. కుల్దీప్, జడేజా రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. బుమ్రా, సిరాజ్ పేస్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. మూడో రోజు ఆటలో వీరు అశ్విన్ లేని లోటును ఎంతవరకు భర్తీ చేస్తారో చూడాలి. రెండో రోజు ఆటలో భాగంగా క్రాలి వికెట్ తీసుకున్న అశ్విన్.. టెస్ట్ కెరీర్ లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 3000 పరుగులు, 500 వికెట్ల ఘనతను సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఓవరాల్ గా ఈ లిస్ట్ లో ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్, ఇంగ్లాండ్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అశ్విన్ కంటే ముందు ఈ ఫీట్ సాధించారు.