సరిహద్దుల్లో బలగాల విస్తరణపై ఇండియా ఫోకస్

సరిహద్దుల్లో బలగాల విస్తరణపై ఇండియా ఫోకస్

లడఖ్: సరిహద్దుల్లో చైనాతో తిరిగి ఉద్రిక్తతలు నెలకొనడంతో ఇండియా లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పలు విస్తరణలను మారుస్తోందని సమాచారం. యథాతథ స్థితికి భంగం కలిగించడానికి పీఎల్ఏ దళాలు యత్నించిన పాంగాంగ్ సరస్సు తీరంతో సహా కీలక ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయడంతో పాటు విస్తరణల మార్పునకు చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. ఇండియా భూభాగం వైపు చైనా అతిక్రమణలను అడ్డుకోవడానికి పాంగాంగ్ లేక్ కు సమీపంలో వ్యూహాత్మకంగా ఎత్తయిన ప్రదేశాల్లో భారత్ పట్టు సాధించింది. తాజాగా డ్రాగన్ కుతంత్రాలను తుత్తునియలు చేయడానికి పటిష్ట భద్రతను పెంచడంతో పాటు కీలక చర్యలు చేపట్టిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ముందస్తు జాగ్రత్తలో భాగంగా కొన్ని మిలటరీ పొజిషన్స్ లో పాంగాంగ్ లేక్ నార్తర్న్ బ్యాంక్ తోపాటు ఎల్ఏసీ వెంబడి సున్నితమైన ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ విస్తరణ చర్యలు చేపట్టినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. పాంగాంగ్ లేక్ కు దక్షిణ ఒడ్డులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరు దేశాల ఆర్మీలు ఇక్కడికి భారీగా బలగాలను పంపుతున్నాయి. తాజాగా ఈ ప్రాంతంలో తన నియంత్రణను పెంచుకోవడానికి ఇండియా పలు కీలక చర్యలు చేపట్టిందని సమాచారం. తద్వారా ఈ సెక్టార్ లో ఆధిపత్యం నిరూపించుకోవాలని యత్నిస్తోందని తెలిసింది. అలాగే ఇక్కడి నుంచి చైనాపై ఓ కన్నేసి ఉంచాలని ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.