ముగిసిన ఐదో దశ పోలింగ్.. ఎంత శాతం పోలింగ్ నమోదయ్యిందంటే..

 ముగిసిన ఐదో దశ పోలింగ్.. ఎంత శాతం పోలింగ్ నమోదయ్యిందంటే..

 పార్లమెంటు ఎన్నికల ఐదో విడత పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. మొత్తం 8 రాష్ట్రాల్లో 49 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. కాగా, 49 స్థానాలకు మొత్తం 659 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఆయా రాష్ట్రాల్లో ఓటింగ్ సజావుగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.యూపీలోని 14, మహారాష్ట్రలో 13, పశ్చిమబెంగాల్ లో 7, ఒడిశాలో 5, బీహార్ లో 5, జార్ఖండ్ లో 3, జమ్మూకాశ్మీర్, లడఖ్ లో ఒక్కో స్థానానికి పోలింగ్ కొనసాగింది.

ప్రముఖులు పోటీ పడిన పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా ఈ ఐదో దశలోనే పోలింగ్ జరిగింది. వాటిలో అమేథీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నుంచి కేఎల్ శర్మ పోటీ చేశారు. రాజ్ నాథ్ సింగ్ బరిలో ఉన్న లక్నో నియోజకవర్గం, పియూష్ గోయల్ పోటీ చేసిన ముంబై నార్త్ నియోజకవర్గం, రాహుల్ గాంధీ పోటీ చేసిన రాయ్ బరేలీ నియోజకవర్గం, చిరగ్ పస్వాన్ పోటీ చేసిన హజీపూర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కొడుకు శ్రీకాంత్ షిండే బరిలో ఉన్న కల్యాణ్ నియోజకవర్గం, ఓమర్ అబ్దుల్లా – బారాముల్లా నియోజకవర్గం, ఆర్జేడీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహీణి ఆచార్య బరిలో ఉన్న సరన్ నియోజకవర్గాలకు కూడా ఈ ఐదో దశలోనే పోలింగ్ జరిగింది.

  • సాయంత్రం 5 గంటల వరకు 56.68 శాతం పోలింగ్ నమోదయ్యింది. 
  • అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో 73 శాతం పోలింగ్ నమోదు. 
  • అత్యల్పంగా మహారాష్ట్రలో 48.66 శాతం పోలింగ్ నమోదు.
  • లడఖ్ లో 67.15 శాతం పోలింగ్ నమోదు
  • జార్ఖండ్ – 61.90 శాతం పోలింగ్ నమోదు
  • ఒడిశా – 60.55 శాతం పోలింగ్ నమోదు
  • యూపీ – 55.80 శాతం పోలింగ్ నమోదు
  • జమ్మూ కాశ్మీర్ 54.21 శాతం పోలింగ్ నమోదు
  • బీహార్ – 52.35 శాతం పోలింగ్ నమోదు..

ఈ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖులంతా తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, సామాన్యులతోపాటు లైన్లలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, జాన్వీ కపూర్, ఐరా ఖాన్, ఫర్హన్ అక్తర్, జోయా అక్తర్, రాజ్ కుమార్ రావ్ తోపాటు పలువురు సినిమా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కెనడా పౌరసత్వం కలిగిన అక్షయ్ కుమార్, గతేడాది ఆగస్టులో తొలిసారి భారతీయ పౌరసత్వం పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నేడు మొదటిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది.