ఇండియాలో రైళ్లలో ఎక్కువగా వినిపించే పదం సమోసా. గరం గరం వేడి వేడి సమోసే.. అంటూ పొట్టకూటి కోసం చాలా మంది అమ్ముకుంటుంటారు. ఇప్పుడు ఇదే అరుపు.. ఇదే పిలుపు లండన్ రైళ్లలో వినిపిస్తోంది. ఒక ఇండియన్.. ఇండియన్ ట్రెడిషన్ లో రెడీ అయ్యి సమోసాలు అమ్ముకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియా పరువు తీశావంటూ ట్రోలింగ్ మొదలైంది. మిక్స్డ్ రియాక్షన్స్ తో డిబేట్ నడుస్తోంది.
అయితే ఇక్కడ సమోసాలు అమ్ముతున్నది మూమూలు వ్యక్తేం కాదు. సేల్స్ బాయ్ అసలే కాదు. లండన్ లో ఫేమస్ అయిన ఘంటావాలా బిహారీ సమోసా అనే రెస్టారెంట్ ఓనర్. సౌత్ హరో అండర్ గ్రౌండ్ ట్యూబ్ స్టేషన్ లో సమోసాలు అమ్ముతూ సందడి చేశాడు. ఇకనుంచి ఇక్కడి స్థానికులు క్రాయిసెంట్స్ తినాల్సిన పనిలేదు.. వాళ్లు బిహారీ సమోసాలు తింటారు.. అని అంటున్నాడు.
తన హోటల్ కిచెన్ లో సమోసాలు తయారు చేసుకుని ట్రైన్ లోకి తీసుకెళ్లి ప్యాసెంజర్స్ కు అమ్మడం వీడియోలో చూడవచ్చు. వేడివేడి సమోసాలకు తోడు పుదీనా, చింతపండు చట్నీ అమ్ముతూ అందరినీ ఆకర్శిస్తున్నాడు. కస్టమర్స్ అందరూ ఇండియన్స్ కావడంతో.. ఇన్‌స్టాలో వైరల్ గా మారింది. రెస్టారెంట్ ను ప్రమోట్ చేసుకునేందుకే రైళ్లలో సమోసాలు అమ్ముతూ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓనర్.
పరువు తీశావు భయ్యా అంటూ అసహనం:
హోటల్ ఓనర్ సమోసాలు అమ్మడంపై కొందరు సోషల్ మీడియాలో తమ అసంతృప్తి, అసహనాన్ని వెల్లగక్కుతున్నారు. ఇది చాలా ఎంబరాసింగ్ గా ఉంది.. ఇండియా పరువు తీశావ్ అంటూ కామెంట్ చేశారు. నీ అమ్మకాల కోసం ఇండియా పరువు తీయకు బ్రో అని ఒకరు కామెంట్ చేశారు. చూడటానికి దరిద్రంగా ఉంది.. అది రియల్ కాదు.. ఏఐ అని చెప్పండి.. నా మనసు శాంతిస్తుందని మరొకరు రిప్లై ఇచ్చారు.
కొందరు సమోసా ప్రియులు పాజిటివ్ గా రిప్లై ఇచ్చారు. దుబాయిలో కూడా ట్రై చేయొచ్చుకదా అని ఒకరు అంటే.. రివర్స్ వలసవాదం అంటూ జోక్ చేశారు. ఒకవేల క్రాయిసెంట్స్ ను సమోసాలు రీప్లేస్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ మరొకరు ఆశావాద దృక్పథాన్ని ప్రదర్శించారు.
అయితే ఇదే ఓనర్ సెప్టెంబర్ లో కూడా ఇలాంటి వేషధారణతో లండన్ స్ట్రీట్స్ లో సమోసాలు అమ్ముతూ వైరల్ అయ్యాడు. ప్రస్తతం రైళ్లలో అమ్ముతుండటంతో మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఇది ఎందుకు ఎంబరాసింగ్ గా ఉందో అర్థం కావడం లేదు. తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అతడు సెల్ఫ్ అడ్వర్టైజింగ్ చేసుకుంటున్నాడు. దీనికి ఇండియా పరువు ఎలా పోతుందో అర్థం కావడం లేదని కొందరు గట్టిగానే ఇచ్చిపడేస్తున్నారు. మొహమాటం లేకుండా, క్రియేటివ్ గా వ్యాపారం చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవడం మీకెలాగో తెలియదు.. చేసేవాళ్లను ఇలా ట్రోల్ చేయడం ఒక్కటే మీకు తెలిసింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
