శ్రీశైలంలో చెంచులకు ఉచితంగా మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం..

శ్రీశైలంలో చెంచులకు ఉచితంగా మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం..

శ్రీశైలంలో చెంచు గిరిజనులకు ఉచితంగా స్పర్శ దర్శనం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దేవస్థానం ట్రస్టు. గిరిజన గూడెంలో చైర్మన్ పర్యటన సందర్భంలో చెంచులు గిరిజనులు ఛత్రపతి శివాజీ శ్రీశైలం వచ్చినప్పుడు రక్షణ కల్పించిన మాకు శ్రీమల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం కల్పించమని కోరడడంతో ఇటీవల జరిగిన దేవస్థానం బోర్డు సమావేశంలో ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు,సభ్యులు,ఈవో శ్రీనివాసరావు శ్రీశైలం పరిధిలోని చెంచు గిరిజనులకు ప్రతి నెలలో ఒక రోజున ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని ఆమోదించారు.

అయితే నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా చెంచు గిరిజనులకు శ్రీ మల్లికార్జునస్వామివారి స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడంతో... శ్రీశైలం పరిధిలోని సుమారు 200 మంది చెంచు గిరిజనులు శ్రీశైలం చేరుకొని స్థానిక గిరిజన గూడెమైన మేకల బండ నుండి మేలతాళాలతో చెంచు గిరిజనులు ప్రత్యేక నృత్యాలు డాన్సులు వేస్తూ డొనేషన్ కౌంటర్ వద్ద గల క్యూ లైన్స్ వద్దకి చేరుకున్నారు. చెంచు గిరిజనులకు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఆలయ ఈవో శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు.

అనంతరం క్యూలైన్స్ ద్వారా శ్రీ మల్లికార్జునస్వామివారి ఉచితంగా స్పర్శ దర్శనం చేసుకుని.. శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుండి అన్నదాన కేంద్రానికి తరలివెళ్లారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఇకనుండి ప్రతినెలలో ఒకరోజు శ్రీమల్లికార్జునస్వామివారి స్పర్శ దర్శనం చెంచు గిరిజనులకు ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు. శ్రీశైలం ఈరోజు ఒక చరిత్రగా నిలిచిపోనుందని.. ఉచిత స్పర్శ దర్శనం కల్పించడంతో చెంచు గిరిజనుల కళ్ళలో ఆనందం చూశానని అన్నారు. అలానే మిగిలిన ఆలయాలలో కూడా ఇలా ఉచితంగా పలు తెగలకు సంబంధించిన గిరిజనులకు ఉచిత దర్శనం కల్పిస్తే బాగుంటుందని చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు.