జమ్మూ కశ్మీర్ గురించి మాట్లాడే హక్కు ఏ దేశానికి లేదు: పాక్, చైనా ప్రకటనపై ఇండియా ఫైర్

జమ్మూ కశ్మీర్ గురించి మాట్లాడే హక్కు ఏ దేశానికి లేదు: పాక్, చైనా ప్రకటనపై ఇండియా ఫైర్

న్యూఢిల్లీ: యూఎన్ చార్టర్ ప్రకారం కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలన్న చైనా, పాకిస్తాన్ దేశాల సంయుక్త ప్రకటనపై ఇండియా ఫైర్ అయ్యింది. జమ్మూ కశ్మీర్, లడక్ గురించి మాట్లాడే హక్కు ఏ దేశానికి లేదంటూ చైనా, పాకిస్తాన్‌ల సంయుక్త ప్రకటన భారత్ తీవ్రంగా ఖండించింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు గతంలోనూ.. ఇప్పుడు భారతదేశంలో అంతర్భాగంగా విడదీయరాని భాగంగా ఉన్నాయని.. భవిష్యత్తులోనూ ఎప్పటికీ అలాగే ఉంటాయని స్పష్టం చేసింది.

 ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. చైనా-పాకిస్తాన్ సంయుక్త ప్రకటనలో జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి చేసిన అనవసర ప్రస్తావనలను ఇండియా ఖచ్చితంగా తిరస్కరిస్తుందని పేర్కొన్నారు. ఇండియాలో అంతర్భాగాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లకు సంబంధించిన విషయాలపై వ్యాఖ్యానించే హక్కు మరే ఇతర దేశానికి లేదని స్పష్టం చేశారు. చైనా-పాకిస్తాన్ చేపట్టిన ఎకనామిక్ కారిడార్ (CPEC)కు సంబంధించిన ప్రస్తావనలను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 

భారతదేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తూ ఈ భూభాగాలను పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించుకోవడాన్ని బలపరిచేందుకు లేదా చట్టబద్ధం చేసేందుకు ఇతర దేశాలు చేసే ఏ ప్రయత్నాలనైనా మేము గట్టిగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇండియా తన ఆందోళనలను పాకిస్తాన్, చైనాలకు పలుమార్లు తెలియజేసిందని తెలిపారు. పాకిస్థాన్, చైనాల మధ్య కుదిరిన 1963 సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఎన్నడూ గుర్తించలేదని పేర్కొన్నారు.