న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఒడిశా తీరంలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్వీ) సాంకేతికత కలిగిన అధునాతన ‘అగ్ని’ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది.
ఎంఐఆర్వీ సాంకేతికతతో కూడిన ఈ అత్యాధునిక ఫీచర్ ద్వారా ఒకే క్షిపణి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న బహుళ లక్ష్యాలపై ఏకకాలంలో విరుచుకుపడగలదు. ఒకే క్షిపణి ద్వారా అనేక వార్‌హెడ్‌లను ప్రయోగించవచ్చు. శుక్రవారం ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని విస్తారమైన భౌగోళిక పరిధిలో ఉన్న వేర్వేరు లక్ష్యాలను ఈ క్షిపణి విజయవంతంగా చేరుకుంది. ఈ విజయం భారత వ్యూహాత్మక సామర్థ్యాన్ని, రక్షణ శక్తిని మరింత బలోపేతం చేయనుంది.
